కిరణ్ కుమార్ రెడ్డికి ఏమాత్రం సిగ్గున్నా పదవి నుండి తప్పుకోవాలని టీఆరెస్ జనరల్ సెక్రటరీ కేశవరావు డిమాండ్ చేసారు. అనవసరంగ ఎన్.జీ.వోలను రెచ్చగొట్టి సీఎం ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారని, గవర్నర్ వెంటనే ఆయనను పదవి నుండి తప్పించాలని కోరారు. తెలంగాణ భవన్ లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సీమాంధ్రలో అత్యవసర సేవలు కూడా ఆగిపోవడానికి కిరణ్ కుమార్ రెడ్డే కారణమని దుయ్యబట్టారు. సీఎం వెనకుండి విద్యుత్ సమ్మె చేయిస్తున్నారని ఆరోపించారు. సీఎంకు రాజ్యాంగంపై కనీస అవగాహన కూడా లేదని, అసెంబ్లీ కంటే కూడా కేంద్ర క్యాబినెట్ కే ఎక్కువ అధికారాలుంటాయని, అసెంబ్లీ తీర్మానం కంటే క్యాబినెట్ నోటే ప్రధానమని తెలిపారు.
పంజాబ్ విభజన సందర్భంగా అప్పటి సీఎం రాంకిషన్ వ్యతిరేకిస్తే ఇందిరాగాంధీ రాష్ట్రపతి పాలన పెట్టి విభజించారని, ఇప్పుడు కూడా రాష్ట్రపతి పాలన పెట్టి విభజన ప్రక్రియ పూర్తిచేయాలని కోరారు.
ముఖ్యమంత్రి కుట్రలను రిటైర్డ్ డీజీపీ దినేష్ రెడ్డి నగ్నంగా బయట పెట్టారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సీఎంపై, ఆయన తమ్ముడు జరిపిన భూ దందాలపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేసారు. అంతేకాకుండా హైదరాబాద్ లో ఏపీ.ఎన్.జీవో సభ వద్దని టీఆర్ఎస్ చెప్పినా సీఎం అనుమతివ్వాలని ఒత్తిడి చేసారని మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టడం, ఏపీఎన్జీవోలను ఉసిగొల్పడం, సభలను పెట్టించడం, పారామిలిటరీ బలగాలు అడ్డుకోవడం వంటి కుట్రలను చేస్తోన్న సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసారు.
టీఆరెస్ నేత హరీశ్ రావు మాట్లాడుతూ “తాజా మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ఆరోపణల సాక్షిగా సీఎం కుట్రలు, కుతంత్రాల గుట్టు రట్టయింది. దొంగకు చీకటి తోడైనట్టు ఇద్దరూ రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించడమే కాకుండా, అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణ ప్రజల జీవితాలతో ఎంతగా చెలగాటమాడారో స్పష్టమైపోయింది. తెలంగాణలో నక్సల్స్ సమస్య లేకపోయినా ఉందని చెప్పమనడం, ఏపీఎన్జీవోల మీటింగ్ కు సీఎం ఒత్తిడి మేరకే అనుమతి ఇచ్చినట్టు దినేష్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇన్నాళ్ళూ టీఆర్ఎస్ చెబుతున్న మాటలు నిజమేనని తేల్చాయి. ఇలాంటి సీఎం సారధ్యంలో రాష్ట్ర విభజన సజావుగా సాగుతుందనే నమ్మకం లేదు. ఇంకా ఒక్క క్షణమైనా కిరణ్ సీఎం పదవిలో కొనసాగడానికి వీల్లేదు” అని డిమాండ్ చేసారు.