సీనియర్ ఐఏస్ అధికారి ఎస్ నర్సింగరావును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ముఖ్యకార్యదర్సిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగేళ్ళపాటు సింగరేణి కాలరీస్ సీఎండీ గా విధులు నిర్వర్తించిన ఆయన జాతీయ స్థాయిలో కోల్ ఇండియా లిమిటెడ్ కు సీఎండీగా ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టడంతో నర్సింగరావు కోల్ ఇండియా సీఎండీ పదవికి రాజీనామా చేసి తిరిగి రాష్ట్రానికి వచ్చారు.
మెదక్ జిల్లాలోని గొట్టిముక్కల గ్రామంలో పుట్టిన నర్సింగరావు 1986 ఐఏస్ అధికారిగా బాధ్యతలు చేపట్టి అనేక పదవులు నిర్వహించారు. సింగరేణి సంస్థ 55 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి భారీ లాభాలు పొందేలా కృషి చేశారు. ఆయన సేవలు మెచ్చుకుని భారత ప్రభుత్వం ఏప్రిల్ 2012లో కోల్ ఇండియా సీఎండీగా నియమించింది. కేసీఆర్ ఆదేశాల మేరకే ఆయన పదవికి రాజీనామా చేసి తిరిగి రాష్ట్ర సర్వీసులో చేరారు. గురువారం ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వగానే ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.