mt_logo

నల్లబంగారంపై సభలో సీఎం అబద్దాలు!

తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి నుండి ఒక్క టన్ను బొగ్గు కూడా ఆంధ్రా ప్రాంతానికి వెళ్ళడంలేదని అసెంబ్లీ నిండు సభలో సీఎం వెల్లడించారు. ఇక్కడి బొగ్గు వనరులు ఆంధ్రా ప్రాంతానికి వెళ్తున్నది నిజమేనని, టన్ను బొగ్గు కూడా వెళ్ళట్లేదని చెప్పడం వింతగా ఉందని సింగరేణి ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. విజయవాడకు ఎన్నో రైల్వే వ్యాగన్ల బొగ్గు లోడ్ చేసి పంపించామని రామక్రిష్ణాపూర్ కు చెందిన మరో కార్మికుడు వెల్లడించాడు. సింగరేణి ఉత్పత్తిలో తెలంగాణ ప్రాజెక్టులకు 185.60 లక్షల టన్నుల బొగ్గు కేటాయించగా, రాయలసీమకు 38.80 లక్షల టన్నుల బొగ్గు కేటాయించామన్న సీఎం వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ప్రతీ సంవత్సరం సింగరేణిలో 54 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో 15 శాతం ఎలాంటి లింకేజీ లేకుండానే కేటాయిస్తున్నారు. అంతేకాకుండా సింగరేణిలో లభించే సీ గ్రేడ్ బొగ్గును ఆంధ్రా ప్రాంతానికి చెందిన పరిశ్రమలకే తరలిస్తున్నారు. ఆంధ్రాలోని దక్కన్ సిమెంట్స్, దక్కన్ పవర్ ప్లాంట్ కు పోయినేడాది ఇక్కడినుండే 46,058 టన్నుల బొగ్గు కేటాయించారు. రాజమండ్రిలోని ఏపీ పేపర్ మిల్లుకు నాలుగు లక్షల టన్నుల బొగ్గు తరలించారు. విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్ కు 2011-12లో 46లక్షల టన్నులు, 2012-13లో 54 లక్షల టన్నులు, 2013-14లో జనవరి 15 వరకు 38 లక్షల టన్నుల బొగ్గును పంపించారు. ఇవన్నీ పక్కా రికార్డుల్లో ఉన్నా బొగ్గు ఆంధ్రాప్రాంతానికి తరలించట్లేదని అనడం పట్ల తెలంగాణ వాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. సాధారణ రేట్ల కంటే ఎక్కువకు అమ్ముకుంటే సింగరేణికి లాభాలు వస్తాయని తెలిసినా అలా చేయకుండా సిరులగిరి సింగరేణిని నష్టాల బాట పట్టించడానికి కారణమైన సీమాంధ్ర పరిశ్రమలకు బొగ్గు తరలించడం తెలంగాణ ప్రజలకున్న ఔదార్యమని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *