mt_logo

మహా అజ్ఞాన ప్రదర్శన-కట్టా శేఖర్‌రెడ్డి

వెనుకబడిన జిల్లాల జాబితాలో హైదరాబాద్ తప్ప తక్కిన తెలంగాణ జిల్లాలన్నీ ఉన్నాయి. సీమాంధ్రలో అనంతపురం, కడప, చిత్తూరు, విజయనగరం మాత్రమే ఉన్నాయి. ఆ విషయం ముఖ్యమంత్రికీ తెలుసు. ఇతర సీమాంధ్ర నేతలకూ తెలుసు. వారు అసెంబ్లీలో చెబుతున్నవన్నీ అబద్ధాలని చెప్పడానికి ఇంతకంటే రుజువులు ఏమి కావాలి? బాబూ, మీ బంగారు కంకణాలు వద్దు, మీరు శాకాహారులుగా మారనూ వద్దు. తెలంగాణ ఇంకే మాత్రం మీ కపట ప్రేమను భరించలేదు.

చట్టసభ సాక్షిగా మంత్రులు, మహామంత్రుల చారిత్రక అజ్ఞాన ప్రదర్శన చూస్తుంటే ఆశ్చర్యం వేస్తున్నది. వృద్ధ సింహం బంగారు కంకణం కథ గుర్తుకు వస్తున్నది. విడిపోతే తెలంగాణకే అన్యాయం జరుగుతుందని దుఃఖపడుతుంటే నవ్వొస్తున్నది. వారు చెబుతున్న వంద అబద్ధాల సంగతి వదిలేద్దాం. కష్ణా నది జలాల గురించి వారు చెప్పిన లెక్కలు, చేసిన బెదిరింపులు చూస్తే వారి వాదనల్లోని డొల్లతనం తెలిసిపోతుంది. శ్రీశైలం డ్యాము నుంచి నీటిని ఉపయోగించుకోవడం వల్ల 13 లక్షల ఎకరాల్లో సాగు స్థిరీకరణ జరిగింది అని చెప్పిన నోటితోనే విడిపోతే నెట్టెంపాడుకు, కల్వకుర్తి, ఏఎంఆర్ ప్రాజెక్టులకు నీటిని కోల్పోతారని బెదిరించారు. కలిసి ఉంటే ఇంటర్ బేసిన్ చేంజ్ కింద ఈ ప్రాజెక్టులకు నీరు సర్దుబాటు చేయవచ్చునని కూడా ముఖ్యమంత్రి బోధించారు.కష్ణా పరీవాహక ప్రాంతంలో 1955లో నాలుగు లక్షల ఎకరాలు మాత్రమే సాగులో ఉండేదని ఇప్పుడు 43లక్షల ఎకరాలు సాగవుతుందని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. అంటే ముఖ్యమంత్రి లెక్క ప్రకారం కృ ష్ణానది కింద సాగవుతున్నది కానీ, స్థిరీకరించింది 56లక్షల ఎకరాలు.

ఇందులో తెలంగాణలో సాగవుతున్నది లెక్క ప్రకారం- వాస్తవ లక్ష్యాలు ఎలా ఉన్నా, సాగర్ ఎడమ కాలువ కింద 8లక్షల ఎకరాలు, ఏఎంఆర్ కింద లక్ష ఎకరాలు, జూరాల కింద లక్ష ఎకరాలు, రాజోలిబండ మళ్లింపు కాలువ కింద 30వేల ఎకరాలు మొత్తం 10.3 లక్షల ఎకరాలు, ఇంకొంచెం పెంచి 11 లక్షల ఎకరాలు అనుకుందాం.56లక్షల ఎకరాల్లో పదకొండు లక్షల ఎకరాలు తీసేస్తే 45 లక్షల ఎకరాలు ఎక్కడ సాగవుతున్నది? సీమాంధ్రలో 5 లక్షల ఎకరాలు 45 లక్షల ఎకరాలు ఎలా అయింది? తెలంగాణలో పదకొండు లక్షల ఎకరాలు మాత్రమే ఎందుకు సాగులో ఉంది? సాగుభూమి ఎక్కడ ఎక్కువ పెరిగింది? కలిసి ఉండి ఎవరు ఎక్కువ బాగుపడ్డారు? ఎవరి నిధులు ఎవరికి ఖర్చు చేశారు? ఎవరు ఎవరిని పోషించారు? ఎవరు మోసపోయారు? ఇవ్వాళ మళ్లీ ఎవరిని మోసగించాలని చూస్తున్నారు? వాస్తవానికి నెట్టెంపాడు, కల్వకుర్తి, ఏఎంఆర్ ప్రాజెక్టులు కష్ణా బేసిన్ లో కష్ణా పరీవాహక ప్రాంతానికి నీరందించడానికి న్యాయంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులకు ఇచ్చిన తర్వాతనే రాయలసీమలోని ఏ ప్రాజెక్టుకయినా నీరు వెళ్లాలి. అవి నికర జలాలైనా, మిగులు జలాలైనా సరే. ఇంటర్ బేసిన్ చేంజ్ అంటే ఒక బేసిన్ నీటిని మరో బేసిన్‌కు తరలించడం. సీమాంధ్ర ప్రభుత్వాలు గత మూడు దశాబ్దాలుగా చేస్తున్నది అదే.

ఇంటర్ బేసిన్ చేంజ్ దయ తెలంగాణకు అక్కర లేదు. కృష్ణా నీటితో పెన్నా బేసిన్ ప్రాజెక్టులన్నీ నింపుకునేందుకు కాలువలు తవ్వారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఒక నది స్థాయికి పెంచి నీరు మళ్లించుకుపోయారు. సోమశిల, కండలేరు, గండికోట, మైలవరం, బ్రహ్మంగారి మఠం, అవుకు.. ఇలా నిర్మించిన రిజర్వాయర్లకు కష్ణా బేసిన్‌కు సంబంధంలేదు. అవన్నీ పెన్నా నదిపై లేక దాని ఉపనదులపై నిర్మించినవి. ఇంటర్ బేసిన్ చేంజ్ సర్దుబాటు సీమాంధ్రకు అవసరం.కానీ తెలంగాణకు కాదు. సుమారు 150టీఎంసీల నీటిని తరలించేందుకు సీమాంధ్ర నాయకత్వం కుట్రలు చేసింది.
బచావత్ ట్రిబ్యునల్ నివేదిక నిర్ధారించిన 298టీఎంసీలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన 370టీఎంసీ లు కానీ తెలంగాణలో వినియోగంలోకి తీసుకువచ్చి ఉంటే తెలంగాణలో పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు.ఉచిత విద్యుత్ ద్వారా తెలంగాణ రైతులకు 19,377 కోట్ల రూపాయల మేలు జరుగుతున్నదని విడిపోతే విద్యుత్ సమస్య వస్తుందని కూడా ముఖ్యమంత్రి చెబుతున్నారు. కాలువల్లొ నీళ్లు లేక, రాక, బోర్లు వేసి, కరెంటు మోటార్లు పెట్టి తెలంగాణ రైతాంగం నష్టపోయింది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుందో చెప్పగలరా? అర్ధరాత్రి అపరాత్రి మీరిచ్చే విద్యుత్ కోసం తెలంగాణలో ఇప్పటివరకు కరెంటు షాకులతో మరణించిన రైతుల లెక్కలు తీద్దామా? తెలంగాణకు న్యాయంగా రావలసిన నీటివాటా రాకపోవడం వల్ల తెలంగాణ ఎంత నష్టపోయిందో చెప్పగలరా? కష్ణా నుంచి తెలంగాణకు రావలసిన నీటివాటా 360 టీఎంసీలు అంటే కనీసం 36లక్షల ఎకరాలు సాగు కావాలి. కానీ సాగవుతున్నది 11లక్షల ఎకరాలకు మించదు. మిగిలిన 25 లక్షల ఎకరాల్లో కూడా సాగునీటికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా వ్యవసాయం చేసుకోగలిగి ఉంటే తెలంగాణ రైతాంగం ఎన్ని లక్షలకోట్ల రూపాయలు సంపాదించేవారో లెక్కలు వేద్దామా?.

మరో అబద్ధం.. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాలు సీమాంధ్ర జిల్లాల కంటే అభివౄద్ది చెందాయని. ఈ జిల్లాల్లో తలసరి ఆదాయం పెరిగిందని, సంపద పెరిగిందని, జీడీపీ పెరిగిందని మనఅమాత్యులు, కొందరు సీమాంధ్ర టీడీపీ సభ్యులు లెక్కలు చెబుతున్నారు. తలసరి ఆదాయం, జీడీపీ ఒక బ్రహ్మపదార్థం. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివద్ధి కింద పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి గత యాభైయ్యేళ్లుగా ప్రోత్సాహకాలు ఇచ్చాయి.
ఉచిత భూములు, చౌకవిద్యుత్, పన్ను రాయితీలు, రుణాలు ఇప్పించారు ప్రాంతాలను అభివౄద్ది చేయడమంటే అక్కడ పరిశ్రమ పెట్టి అక్కడి స్థానికులకు ఉపాధి కల్పించడం. సీమాంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెట్టారు. ప్రయోజనాలన్నీ పొందారు. కానీ వారు తమతోపాటే తమ ప్రాంతం నుంచి సిబ్బందిని తెచ్చుకున్నారు తప్ప, స్థానికులకు తగినంతగా ఉపాధి కల్పించలేదు. వాచ్‌మెన్‌లు, స్వీపర్‌లు, కార్మికులు, క్లర్కుల వంటి ఉద్యోగాల్లో మాత్రమే ఇక్కడివారిని తీసుకున్నారు. ఒక ఉద్యోగం వస్తే ఒక కుటుంబంలో ఒక తరం బాగుపడుతుంది. ఆ తర్వాతి తరాలు అభివౄద్దిపథంలో ఉంటాయి.

కానీ తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల ప్రజలకు సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు అటువంటి అవకాశం ఇవ్వలేదు. అక్కడి వారినే తెచ్చుకుని, వారినే ప్రోత్సహించి, హైదరాబాద్‌లో స్థిరపడడానికి దోహదం చేశారు. ఇప్పుడు ఆ కంపెనీలు, వాటి ఆస్తులు, ఆ కంపెనీల ఉద్యోగుల జీతభత్యాలు + మెదక్ జిల్లా ప్రజల ఆదాయం డివైడెడ్‌బై మెదక్ జిల్లా జనాభా= తలసరి ఆదాయం అంటే ఈ నాయకులను ఏమనాలి? పదిమంది పారిశ్రామిక వేత్తలు, పదిమంది సామాన్యుల సంపద డివైడెడ్ బై 20 వేస్తే తలసరి ఆదాయం కోట్లల్లో వస్తుంది. అంతమాత్రాన పేదవాడు ధనికుడు కాలేడు. పేదవాడి తలసరి ఆదాయం పెరిగినట్టు కాదు. ఇదొక మోసపూరితమైన లెక్కల విధానం. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్‌ఫండ్

(బిఆర్‌జిఎఫ్-http://www.nird.org.in/brgf/doc/BRGFFINALGUIDELINES.pdf)పథకం కింద రాష్ట్రంలో పదమూడు జిల్లాలను వెనుకబడిన జిల్లాల కింద గుర్తించి గత పదేళ్లుగా నిధులు కేటాయిస్తున్నది. వంద కొలమానాల ఆధారంగా ఆ జిల్లాలను ఎంపిక చేసింది. వెనుకబడిన జిల్లాల జాబితాలో హైదరాబాద్ తప్ప తక్కిన తెలంగాణ జిల్లాలన్నీ ఉన్నాయి. సీమాంధ్రలో అనంతపురం, కడప, చిత్తూరు, విజయనగరం మాత్రమే ఉన్నాయి. ఆ విషయం ముఖ్యమంత్రికీ తెలుసు. ఇతర సీమాంధ్ర నేతలకూ తెలుసు. వారు అసెంబ్లీలో చెబుతున్నవన్నీ అబద్ధాలని చెప్పడానికి ఇంతకంటే రుజువులు ఏమి కావాలి? బాబూ, మీ బంగారు కంకణాలు వద్దు, మీరు శాకాహారులుగా మారనూ వద్దు.తెలంగాణ ఇంకే మాత్రం మీ కపట ప్రేమను భరించలేదు.
kattashekar@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *