mt_logo

రేపు ఢిల్లీలో బీఆర్ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ఢిల్లీలోని స‌ర్దార్ ప‌టేల్ మార్గ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్‌(భార‌త రాష్ట్ర స‌మితి) కార్యాల‌యాన్ని రేపు మధ్యాహ్నం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కార్యాల‌యాన్ని ప‌రిశీలించిన కేసీఆర్.. ప‌లు సూచ‌న‌లు చేశారు. యాగం, పూజ‌లు జ‌రుగుతున్న ప్ర‌దేశాల‌ను కేసీఆర్ సంద‌ర్శించారు.

అనంత‌రం స‌ర్దార్ ప‌టేల్ మార్గ్ నుంచి వ‌సంత్ విహార్‌కు వెళ్లారు సీఎం. అక్క‌డ నిర్మాణంలో ఉన్న బీఆర్ఎస్ భవ‌నాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిశీలించారు. అన్ని ఫ్లోర్ల‌ను క‌లియ తిరిగి ప‌లు సూచ‌న‌లు చేశారు కేసీఆర్. ముఖ్య‌మంత్రి వెంట రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు కేశ‌వ‌రావు, నామా నాగేశ్వ‌ర్ రావు, సంతోష్ కుమార్, ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

భార‌త రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాల‌యాన్ని రేపు మ‌ధ్యాహ్నం 12:37 నుంచి 12:47 గంట‌ల మ‌ధ్య‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. కేంద్ర కార్యాల‌యంలో మొద‌ట కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్క‌రిస్తారు. అనంత‌రం కార్యాల‌యం ప్రారంభోత్స‌వం చేసి, కేసీఆర్ త‌న గ‌దిలో కూర్చుంటారని మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి వెల్ల‌డించారు.

బీఆర్ఎస్ కేంద్ర కార్యాల‌య ప్రారంభోత్స‌వానికి పంజాబ్, హ‌ర్యానా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ఒడిశా, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు చెందిన రైతు నాయ‌కులు, ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులు హాజ‌రు కాబోతున్నారు. క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కూడా హాజ‌రు కానున్నారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ కూడా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. కేసీఆర్‌తో భావ‌సారూప్యం క‌లిగిన జాతీయ నాయ‌కుల‌ను ఆహ్వానించామ‌ని మంత్రి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *