mt_logo

సీఎం కేసీఆర్ తో సమావేశమైన కృష్ణా రివర్ బోర్డ్ చైర్మన్

సోమవారం సచివాలయంలో కృష్ణా రివర్ బోర్డ్ చైర్మన్ ఎస్ కే పండిట్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి విషయంలో ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును, గత 58 ఏళ్లుగా సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు నదీజలాల విషయంలో జరిగిన అన్యాయాన్ని సీఎం బోర్డు చైర్మన్ ఎస్కే పండిట్ కు వివరించారు. రాష్ట్రం విడిపోయినా ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీని ఆధారాలతో సహా బయటపెట్టారు.

కృష్ణానదిపై నిర్మించిన నాగార్జునసాగర్ నుండి పోతిరెడ్డిపాడు వరకు తెలంగాణకు ఆంధ్రానేతలు ఏవిధంగా అన్యాయం చేశారో, తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తూ నీళ్ళు, విద్యుత్ విషయంలో ఏవిధంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారో కేసీఆర్ కళ్ళకు కట్టినట్లు తెలిపారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు 54 శాతం విద్యుత్ రావాల్సి ఉన్నా దానిని చంద్రబాబు అడ్డుకుంటున్నాడని, గోదావరి రివర్ బోర్డు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అధారిటీ చెప్పినా చంద్రబాబు సీలేరు కరెంట్ ఇవ్వలేదని చెప్పారు. కృష్ణపట్నం ప్రాజెక్టులో తెలంగాణ జెన్కో, డిస్కంలు రూ. 1050 కోట్లు పెట్టుబడి పెట్టాయని, అందువల్ల 54 శాతం కరెంట్ తెలంగాణకు రావాల్సిఉన్నా ఇవ్వకుండా అడ్డుకోవడం వల్లే తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడిందని కేసీఆర్ పేర్కొన్నారు.

శ్రీశైలంలో నీటిని వాడుకోవడానికి, విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి తెలంగాణకు హక్కు ఉందని, శ్రీశైలం విషయంలో ఏపీ సర్కారు చేస్తున్న వాదనలన్నీ తప్పేనని, చంద్రబాబు చేస్తున్న కుట్రలను ఎలాగైనా అరికట్టి తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కోరారు. సీఎం చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత బోర్డు సమావేశంలో ఈ అంశాలన్నిటినీ చర్చించి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని బోర్డు చైర్మన్ పండిట్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో భారీనీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు, వ్యవసాయ శాఖామంత్రి పోచారం, రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *