బేషజాలు పక్కనపెట్టి క్షమాపణ చెప్పలని, క్షమాపణ చెప్పేందుకు కూడా రాద్ధాంతమా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. శాసనసభలో ఈరోజు ఉదయం కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సభలో తీవ్ర గందరగోళం జరగడంతో ప్రతిపక్షనేత జానారెడ్డి మాట్లాడుతూ, సభ్యులెవరైనా సంయమనం పాటించాలని, పరస్పర వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా సభా గౌరవాన్ని కాపాడాలని సూచించారు. అనంతరం సీఎం స్పందిస్తూ ప్రతిపక్షనేత సూచించినట్లుగానే డీకే అరుణ వ్యాఖ్యల వీడియోను సభ్యులకు చూపించి తర్వాత చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్ ను కోరారు. దీంతో సభను స్పీకర్ పావుగంట పాటు వాయిదా వేశారు.
స్పీకర్ మధుసూదనాచారి చాంబర్ లో ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్ల భేటీలో అధికార, విపక్ష సభ్యుల మధ్య జరిగిన వివాదం పుటేజీని పరిశీలించిన అనంతరం వీరిద్దరూ తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఫ్లోర్ లీడర్లు సూచించారు. సభ వాయిదా అనంతరం సీఎం మాట్లాడుతూ శాసనసభలో ఏదో ఒక సమయంలో ఎవరైనా స్లిప్ కావడం సహజమేనని, దానికి ఒక పదంలో విత్ డ్రా చేసుకుంటున్నాను అని చెప్తే సరిపోతుంది. తమ మంత్రి క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, సభలో విలువైన సమయం వృథా అవుతుందని, తర్వాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చించాలని అన్నారు. చర్చ ప్రజా సమస్యలపై ఫలవంతంగా జరగాలని, మంచి పనులు చేయాలని, ప్రజలకు గుర్తుండేలా కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి మాటలు మాట్లాడుకుని సభా సమయాన్ని వృథా చేయొద్దని సీఎం సూచించారు.