mt_logo

సంకీర్ణ సర్కార్ ఖాయం…

– లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలి.

– ప్రధానిగా మోదీ అట్టర్ ఫ్లాప్.. దేశంలో ఇంకా సగం గ్రామాలు అంధకారంలోనే.. ఎవరు ప్రధాని అయినా అభ్యంతరం లేదు..

– ఎన్డీటీవీకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం కేసీఆర్..

వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అత్యంత ఆశ్చర్యకరంగా ఉంటాయని, దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ముఖ్యమంత్రి శ్రీ. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. దేశ ఆర్థిక ముఖ చిత్రం మారాలని, అనేక రంగాల్లో సంస్కరణలు జరుగాలని, నిర్మాణాత్మక మార్పులు రావాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఈ దేశాన్ని నాశనం చేశాయని, పాలనలో ఆ రెండు పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని చెప్పారు. ఎవరో ఒకరిని ప్రధానిని చేయడం తన ఎజెండా కాదని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే తనకు ముఖ్యమని చెప్పారు. అవసరమనిపిస్తే తాను కేంద్ర రాజకీయాల్లోకి రావడానికి విముఖం కాదన్నారు. సీఎం కేసీఆర్ బుధవారం ప్రముఖ ఇంగ్లీష్ చానెల్ ఎన్డీటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ముఖ్యాంశాలు..

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలి. ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలి. అప్పుడే దేశానికి లబ్ధి చేకూరుతుంది. దేశ ప్రయోజనాలు, రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఒక కనీస ఉమ్మడి ఎజెండా, కార్యక్రమాన్ని రూపొందించాలి. పరిపాలనలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఘోరంగా విఫలమయ్యాయి. ఇది ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నది. దేశంలో ఇప్పుడు రాజకీయ శూన్యత ఏర్పడింది. ఎన్డీయే, యూపీఏ కూటమి కన్నా ప్రాంతీయ పార్టీలు ఎక్కువ సీట్లు గెలుచుకోబోతున్నాయి. బీజేపీ మళ్లీ సొంతంగా అధికారానికి రాలేదు. క్రితంసారి గెలిచిన అన్ని రాష్ట్రాలలో బీజేపీ ఈసారి సీట్లు నష్టపోతుంది. 2014తో పోలిస్తే ఫలితాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు చాలా తక్కువ. అత్యధిక సీట్లు గెలుచుకోవడం ముఖ్యం కాదు. అన్ని సీట్లు గెలుచుకున్న కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారన్నది ముఖ్యం. ఆ మెజారిటీకి ప్రాంతీయ పార్టీలు నాయకత్వం వహిస్తాయి.

సంకీర్ణ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనే ప్రచారంలో అర్థం లేదు. అనేక స్కాండినేవియన్ దేశాల్లో సంకీర్ణ ప్రభుత్వాలే గొప్పగా పాలన చేస్తున్నాయి. ఆ దేశాల్లో ప్రజాస్వామ్య పరిపక్వతకు అది నిదర్శనం. దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆ పార్టీలకు 40 శాతం ఓటింగ్ బలముంది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను విస్మరించే పరిస్థితి లేదు.. ఈసారి కాంగ్రెస్, బీజేపీలు ప్రాంతీయ పార్టీలకు ఎందుకు మద్దతునివ్వకూడదు? అవసరమైతే భావసారూప్యత గల పార్టీలతో ఒక జాతీయ పార్టీని ఏర్పాటుచేయాలని నేను ప్రతిపాదిస్తున్నా. సమస్యలన్నింటికీ అది పరిష్కారం చూపగలదని భావిస్తున్నా. ప్రజల అవసరాలను బట్టి ఎజెండాలు, ఆలోచనలు, పథకాలు పుట్టుకొస్తాయి. (ప్రాంతీయ పార్టీల కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న ప్రశ్నకు కేసీఆర్ బదులిస్తూ) దురదృష్టవశాత్తు మనం ఈ దేశంలో నాయకులు, వ్యక్తుల గురించి చర్చిస్తున్నాం. కానీ ఆ చర్చ అంశాల ప్రాతిపదికన జరుగాలి. అంశాల ఆధారంగా ఉత్పన్నమయ్యే పరిస్థితిని బట్టి నాయకులు వస్తారు. హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ వంటి నేతలు దేశానికి ప్రధానమంత్రులుగా ఉంటారని ఎవరూ ఊహించలేదు.

ఈ ఎన్నికల తరువాత భావసారూప్యత ఉన్న వారిలో ఒక ఏకాభిప్రాయం వస్తుందని ఆశిస్తున్నాను. (భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అన్న వాదనలో వాస్తవం ఉందా అన్న ప్రశ్నకు) ఇది అత్యంత సిగ్గుచేటైన విషయం. మన ఇరుగుపొరుగు దేశాలను చూడండి. జీడీపీలో మనకంటే వెనుకబడి ఉన్న చైనా ఇప్పుడు ప్రపంచ అగ్రదేశంగా ఎదిగింది. మరి మనం ఎక్కడ ఉన్నాం? దేశంలో చాలా వనరులు ఉన్నాయి. వాటిలో మనం ఎన్ని వాడుకుంటున్నాం? నీళ్లు ఎన్ని ఉన్నాయి? మనం ఎన్ని వాడుకుంటున్నాం. దేశంలో సగం గ్రామాలు ఇంకా అంధకారంలో ఎందుకు ఉన్నాయి? చెత్త రాజకీయ పరిపాలన వల్లనే ఈ సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏడాది క్రితం ప్రధానిని కలిసి ఒక విషయం చెప్పాను. ఈ దేశంలో 70వేల టీఎంసీల నీటి లభ్యత ఉంది. దేశంలో 40కోట్ల ఎకరాల భూమి మాత్రమే సాగుకు అనుకూలంగా ఉన్నది. ఈ భూమిలో ప్రతి అంగుళానికి నీరు ఇచ్చినా ఇంకా 30వేల టీఎంసీల నీరు మిగులుతుంది. దేశంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 3.44 లక్షల మెగావాట్లు. కానీ మనం పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడం లేదు. పీక్ సమయాల్లో కూడా విద్యుత్ వినియోగం 2.20 లక్షల మెగావాట్లు మాత్రమే. వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ఛత్తీస్‌గఢ్‌లోని విద్యుత్ ఉత్పత్తి స్టేషన్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి.

మరోవైపు వేల సంఖ్యలో గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంది. విద్యుత్‌కోతలు కొనసాగుతున్నాయి. కానీ మిగులు విద్యుత్‌ను మాత్రం వినియోగించుకోలేకపోతున్నాం. కేవలం తప్పుడు విద్యుత్ విధానాల కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. జల వినియోగంలో కూడా ఇదే పరిస్థితి. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని పరిష్కరించడానికి ఓ ట్రిబ్యూనల్ 30, 40 ఏండ్లు తీసుకుంటే మనం ఎట్లా ముందుకు పోగలం? రైతులకు నీరు ఎప్పుడు అందుతుంది అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఈ పరిస్థితులు మారాలన్నారు. మార్పు రావాలని చెప్పారు. మమతా దీదీ దూకుడుగా కనిపిస్తారు. కానీ ఆమె ఎంతో విచక్షణ జ్ఞానం ఉన్నవారు అని చెప్పారు. సోనియాగాంధీ కూడా పరిస్థితులను అర్థం చేసుకోగలరు.. సహనం ఉన్న వ్యక్తి అన్నారు. చంద్రబాబు తన కుట్ర బుద్ధిని మార్చుకోలేదని, ఈ ఎన్నికల్లో ఆయనకు ఘోరపరాజయం తప్పదన్నారు. దేశంలో బీజేపీకి చెందిన వారిపై తప్ప అందరి ఇండ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇదెలా సాధ్యమవుతున్నదని కేసీఆర్ ప్రశ్నించారు.

మొదటిసారిగా దేశంలో ఓ కాంగ్రెసేతర ప్రభుత్వం సొంతంగా ఏర్పడింది. కానీ అది ఘోరంగా విఫలమైంది. గత ఐదేండ్లలో ఈ దేశానికి మోదీ ప్రభుత్వం ఏం ఒరగబెట్టిందో చెప్పగలరా? ఒక్క అంశాన్ని మోదీ ఎత్తి చూపగలరా? రైతులు, పేదలు, గిరిజనులు, దళితులు, నిరుద్యోగుల కోసం ఏం చేశారో చెప్పగలరా? ప్రధానిగా మోదీ అట్టర్‌ఫ్లాప్ అయ్యారు. ఎవరో ఒకరిని ప్రధాని చేయాలన్నది నా ఎజెండా కాదు. ఎవరు ప్రధాని అయినా నాకు అభ్యంతరం లేదు. నేను వారిని స్వాగతిస్తాను. నాకు నా ఎజెండాయే ముఖ్యం. ప్రధానమంత్రి పదవి ముఖ్యం కాదు. ముందుగా సమస్యలు పరిష్కారం కావాలి. దేశ ఆర్థిక ముఖ చిత్రం మారాల్సిన అవసరముంది. నిర్మాణాత్మక మార్పులు రావాలి. న్యాయవ్యవస్థలో సంస్కరణలు జరుగాలి. పాలనాపరమైన సంస్కరణలు జరుగాలి. ప్రజలు అసహనంగా ఉన్నారు. నక్సలిజం వచ్చింది. కొందరు తుపాకులు పట్టుకుంటున్నారు. ఇది దేశానికి మంచిది కాదు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *