mt_logo

ప్రతినెలా ఒక రోజు స్వచ్ఛ హైదరాబాద్- సీఎం కేసీఆర్

అంతర్జాతీయ స్థాయి నగరమైన హైదరాబాద్ ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు స్వచ్ఛభారత్ లో భాగంగా హరితహారం కార్యక్రమం తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చెప్పారు. గురువారం సచివాలయంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంపై నగర ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఈనెల 16 నుండి 20వ తేదీ వరకు స్వచ్ఛ హైదరాబాద్ నిర్వహిస్తామని, ప్రజలనుండి వచ్చిన విజ్ఞప్తులు, సమస్యలపై ఈనెల 26న ప్రజాప్రతినిధులతో మరోసారి సమావేశమవుతామని తెలిపారు. ఈనెల 16న హెచ్ఐసీసీలో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమవుతుందని, ప్రజలందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజాప్రతినిధులు తమ సంపూర్ణ సహకారం అందించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కేవలం నాలుగు రోజులకే ఈ కార్యక్రమం పరిమితం కాదని, ప్రతినెలలో ఒక రోజు కొనసాగుతుందని చెప్పారు.

హైదరాబాద్ ను 400 విభాగాలుగా విభజించాలని ముందుగా అనుకున్నామని, అయితే ఇందులో పారిశ్రామిక ప్రాంతాలకు సంబంధించి 17 భాగాలు, కంటోన్మెంట్ పరిధిలోని 8 భాగాలను కూడా అదనంగా చేర్చి మొత్తం 425 భాగాలుగా చేసినట్లు సీఎం పేర్కొన్నారు. ఈనెల 16న కార్యక్రమం ప్రారంభం కాగానే అధికారుల బృందం తమకు కేటాయించిన ప్రాంతానికి వెళ్తుందని, 20వ తేదీ వరకు అదే ప్రాంతంలో తిరుగుతూ చెత్తను ఏరివేయడం, శిధిలాలను తొలగించడం, బస్తీని పరిశుభ్రంగా మార్చడం లాంటి పనులను ప్రజల భాగస్వామ్యంతో చేస్తుందని చెప్పారు. గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలతో పాటు పోలీసులు, ఆర్మీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సీఎం వివరించారు.

అనంతరం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్న భారీ కార్యక్రమంగా స్వచ్ఛ హైదరాబాద్ నిలిచిపోతుందని, స్వచ్ఛ భారత్ ను భారీ కార్యక్రమంగా పెద్దఎత్తున నిర్వహించే ఖ్యాతి తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందన్నారు. ఒక్కసారిగా ఇంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు నగర పరిశుభ్రత కోసం ముందుకు రావడం అపూర్వమని, ఈ కార్యక్రమం అమలులో మనమే నంబర్ వన్ అని, ఇందుకోసం కేంద్రం నుండి కూడా నిధులు ఇప్పిస్తామని దత్తాత్రేయ స్పష్టం చేశారు.

స్వచ్ఛ హైదరాబాద్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బీజేపీ శాసనసభాపక్ష నేత కే లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తాముకూడా పాల్గొంటామని, ప్రతిఒక్కరూ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ఎంతో గొప్పగా తీర్చిదిద్దిన ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని, దీనిద్వారా హైదరాబాద్ లో పారిశుధ్యం, పచ్చదనం మెరుగుపడతాయని ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ పై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్షాసమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియా పాయింట్ వద్ద కృష్ణయ్య మాట్లాడుతూ, ఇదొక మహత్తర కార్యక్రమమని, రాజకీయాలకు అతీతంగా నేతలు, ప్రజలు భాగస్వామ్యులు కావాలని సూచించారు.

స్వచ్ఛ హైదరాబాద్ లో కంటోన్మెంట్ ను భాగస్వామ్యం చేయడం పట్ల ఎమ్మెల్యే కనకారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు కంటోన్మెంట్ పై సవతిప్రేమ చూపించాయని, ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ప్రజలు భాగస్వాములవుతారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *