mt_logo

టీచర్స్ డే వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా టీచర్స్ డే వేడుకల్ని రాష్ట్రప్రభుత్వం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీష్ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ గురువులందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మాట్లాడుతూ, మనకు అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడని, ప్రపంచంలో ఎంత పెద్ద వ్యక్తికైనా మొదటి బడి అమ్మ ఒడి అని, గురువు సద్గురువైతే రాయి కూడా పాఠం నేర్చుకుంటుందన్నారు.

మృత్యుంజయ శర్మ గారి దగ్గర తాను విద్య నేర్చుకున్నానని, ఫీజు లేకుండా శర్మ గారు తనకు పాఠాలు చెప్పారని, తాను ఇలా మాట్లాడుతున్నానంటే గురుదేవులు పెట్టిన అక్షర భిక్షేనని చెప్పారు. తాను నేర్చుకున్న ఉత్తర గో గ్ర్రహణం పాఠాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని, ఆయన ఏకసంథాగ్రాహి అని పేర్కొన్నారు. మన విద్యార్థులను ప్రపంచంలోనే గొప్ప విద్యార్థులుగా తీర్చిదిద్ది వజ్రాలుగా తయారుచేద్దామని సీఎం వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *