హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతున్న మేడే వేడుకలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడుతూ, తెలంగాణలో ఉన్న డ్రైవర్లకు, 16 వేల మంది హోంగార్డులకు, 12 వేల మంది జర్నలిస్టులకు రూ. 5 లక్షల ప్రమాద భీమా ఈరోజు నుండి వర్తిస్తుందని చెప్పారు. సహజ మరణం పాలైన వారి కుటుంబాలకు ఆర్ధికసాయం రూ. 30వేల నుండి రూ. 60 వేలకు పెంచామని, ప్రసూతి సమయంలో చేసే ఆర్ధికసాయం 10వేల నుండి 20వేలకు పెంచామని సీఎం ప్రకటించారు.
ఆటో రిక్షాలకు పన్ను రద్దు చేశామని, అంతకు ముందు ఉన్న రూ. 70 కోట్ల రుణాలు కూడా మాఫీ చేశామని సీఎం చెప్పారు. బీడీ కార్మికులకు నెలకు రూ. 1000 జీవనభ్రుతి ఇస్తున్నామని, దీంతో 3,70,000 మందికి పైగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో స్కిల్ డెవెలప్ మెంట్ సెంటర్లు రావాలని, ఇందుకోసం కేంద్రం నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాకో స్కిల్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, న్యాక్ ను మరింత విస్తరిస్తామని, ఉత్పాదకరంగంలో చాలా మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోని భారీ పరిశ్రమలన్నీ తెలంగాణకు క్యూ కట్టాలి.. ఇందుకోసం లక్ష 50 వేల ఎకరాలు సిద్ధం చేశాం.. అనేక పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రాబోతున్నాయి.. దేశంలోనే పెద్ద పారిశ్రామిక నగరంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ వివరించారు.
గత ప్రభుత్వాల తెలివి తక్కువతనం వల్ల ఒక్క హెచ్ఎంటీ మూతబడిందని, ఇండియాలో హెవీ మిషన్స్ టూల్స్ కర్మాగారం ఒక్కటి కూడా లేకపోవడం సిగ్గుచేటని, హెవీ మిషన్స్ తయారు చేసే కర్మాగారాలు వస్తే ఎన్నో ఉపాథి అవకాశాలు లభిస్తాయన్నారు. భారతదేశంలో డిఫెన్స్ ఇండస్ట్రీస్ లో హైదరాబాద్ రెండవ స్థానంలో ఉందని, పేపర్ ఇంపోర్ట్ వల్ల ఇక్కడి పేపర్ పరిశ్రమలు దెబ్బతింటున్నాయని, విదేశాల నుండి పేపర్ ఇంపోర్ట్ చేసుకోవడం బంద్ కావాలని సూచించారు. గతంలో కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఉంటుందో తెలీని పరిస్థితి ఉండేది.. ఇప్పుడు కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను చూస్తున్నాం. వచ్చే మార్చి నాటికి మరో మూడువేల మెగావాట్ల విద్యుత్ అదనంగా వస్తుంది.. తెలంగాణలో ఇకపై కరెంట్ కోతలు బంద్.. రైతులకు కూడా ఇకపై కరెంట్ ఇబ్బందులు ఉండవు. రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ ఇస్తున్నాం.. పరిశ్రమలకు కూడా కరెంట్ కోతలు ఉండవని సీఎం చెప్పారు.