mt_logo

గ్రామజ్యోతిని ఆరనివ్వకండి- సీఎం కేసీఆర్

మనం గ్రామజ్యోతిని వెలిగించాం.. ఈ ఒక్కరోజుతో గ్రామజ్యోతి అయిపోలేదు.. వెలిగించిన ఈ దీపం ఆరిపోకుండా కొనసాగించే బాధ్యత అందరిపైన ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో తాను దత్తత తీసుకున్న చిన్న ముల్కనూరులో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు గ్రామానికి చేరుకున్న సీఎం రాత్రి వరకు ఆ గ్రామంలోనే ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ ప్రజాప్రతినిధులంతా సమానులే.. ఎక్కువ తకువ లేదు. కాబట్టి మీమీ గ్రామాల్లోకి వెళ్ళండి.. గ్రామ సభలు పెట్టి ప్రజలతో మాట్లాడి గ్రామ ప్రణాళికలు తయారు చేసి వాటన్నింటినీ సమిష్టిగా అమలు చేయండని మనవి చేస్తున్నానని అన్నారు. పనికిరాని బేదాభిప్రాయాలు, గ్రూపు తగాదాలు, పెత్తనాలు, పంచాయితీలు వద్దు.. ఇంకా గ్రామాలను నిర్లక్ష్యం చేస్తే భావితరం మనల్ని క్షమించదు. అన్ని జిల్లాలూ మనవే.. అన్ని గ్రామాలూ మనవే.. కొన్ని దత్తత తీసుకుని పనిచేస్తే ఆ జిల్లాలకు వెలుగు వస్తుందని మాత్రమే ఈ ప్రయత్నం చేస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు.

మెదక్ జిల్లా ఎర్రవల్లి, కరీంనగర్ జిల్లా చిన్నముల్కనూరులో నేను ఏవిధంగా పనిచేస్తున్నానో, ప్రతి అధికారి, ప్రతి ప్రజాప్రతినిధి, గ్రామస్తులు ఎవరున్న చోట వారు శ్రమిస్తే అద్భుతంగా బంగారు తెలంగాణ తయారు అవుతుంది. గంగదేవిపల్లి ఆదర్శగ్రామంగా మారడానికి 22 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే వాళ్లకు బాసటగా ఎవరూ లేకుండే.. వాళ్లకు వాళ్ళే అన్నీ చేసుకున్నారు. ఇప్పుడు చిన్నముల్కనూరుకు నేనున్నా.. మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు మీ వెంట ఉన్నారు. రెండు సంవత్సరాల్లో గ్రామం రూపురేఖలు మార్చి చూపిద్దామని సీఎం పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్ళలో రూ. 1.80 కోట్లు వస్తాయి. రెండు సంవత్సరాల్లో గౌరవెల్లి రిజర్వాయర్ ను పూర్తి చేసుకుందాం. హుస్నాబాద్ నియోజకవర్గంలో మెజార్టీ ప్రాంతాలకు సాగు, తాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ నీతూకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *