‘ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టాలను, కష్టాలను.. తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ… ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు.సార్ ఆశించినట్లే స్వరాష్ట్ర పాలనలో, సకల జనుల సంక్షేమానికి పాటు పడుతూ దేశానికే తలమానికంగా ఆదర్శంగా నేడు తెలంగాణ నిలిచింది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున మీకివే మా ఘన నివాళులు’ అని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రో. జయశంకర్ గారికి జయంతి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులర్పించారు. ‘తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా… ధ్యాసగా మీరు నడిపిన పోరాటం, జీవితం మహోన్నతమైనది. మీరు కలలుగన్న తెలంగాణ ప్రగతి సాక్షిగా మీకివే మా నివాళులు… జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్’ అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. ఇక ప్రో. జయశంకర్ జయంతి వేడుకలను తెలంగాణ భవన్ లో మంత్రులు ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సార్ విగ్రహానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహముద్ అలీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, లక్ష్మారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కార్పొరేషన్ల చైర్మన్లు విద్యాసాగర్, నగేశ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు రూప్ సింగ్ రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.