హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ లో ఏర్పాటుచేసిన టీఎస్ ఐపాస్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభా వేదికపైకి చేరుకున్న ముఖ్యమంత్రి కార్యక్రమానికి విచ్చేసిన పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలికారు. మొదట జాతీయగీతాలాపన చేసిన అనంతరం సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని పారంభించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని పలు పారిశ్రామిక దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, వివిధ దేశాలనుండి విచ్చేసిన ప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు. ఏవీ ప్రజెంటేషన్ ద్వారా హైదరాబాద్ నగర ప్రత్యేకతలు, మేక్ ఇన్ తెలంగాణ వంటి అంశాలను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని రూపొందించిందని, దళిత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా అనుమతులు మంజూరు చేస్తామని సీఎస్ స్పష్టం చేశారు.
టీఎస్ ఐపాస్ సోలార్ బుక్ పాలసీ రిలీజ్ ను, ఆన్ లైన్ అప్లికేషన్ వెబ్ పోర్టల్ ను లాంచ్ చేసిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో పరిశ్రమలకు నూరుశాతం కరప్షన్ ఫ్రీతో అనుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చేందుకు ప్రత్యేక బృందాన్ని నియమిస్తున్నామని, పారిశ్రామికవేత్తల దరఖాస్తులు పరిశీలించి అధికారులు మళ్ళీ సంప్రదిస్తారన్నారు. ఆన్ లైన్ లో పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని, దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం ప్రకటించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఛేజింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని, పరిశ్రమల వ్యవహారాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తామని చెప్పారు.
రూ. 8 వేల కోట్లతో ఐటీసీ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిందని, పరిశ్రమల స్థాపనకు పైరవీలు అక్కర్లేదని, తగిన సెక్యూరిటీ కల్పిస్తామని సీఎం అన్నారు. క్రైం రేట్ తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశాం.. పోలీసు వ్యవస్థను ఆధునీకరించి నగరంలో లక్షా 50 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని సీఎం వివరించారు.