mt_logo

రూ. 400 కోట్లతో మహేశ్వరంలో మైక్రోమ్యాక్స్ యూనిట్..

గురువారం మహేశ్వరం నియోజకవర్గంలో టీఎస్ఐఐసీ కింద పరిశ్రమలకు అనుకూలంగా ఉన్న భూములను రవాణా శాఖామంత్రి మహేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, మహేశ్వరం మండలంలోని శ్రీనగర్ సిటీలో మైక్రోమ్యాక్స్ సంస్థ యూనిట్ ఏర్పాటు చేయనుందని, ఇందుకోసం 50 ఎకరాలు కేటాయించామని తెలిపారు. రూ. 400 కోట్ల పెట్టుబడితో త్వరలోనే సంస్థ యూనిట్ నెలకొల్పుతారని, దీనిద్వారా సుమారు 2వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.

ఐటీ మంత్రి కేటీఆర్ తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పడం కోసం పలు దేశాల్లో పర్యటించారని, అప్పటినుండి తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పడానికి ఎన్నో సంస్థలు ముందుకొస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో దాదాపు 150 నుండి 200 కంపెనీలు పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి చూపాయని, దీనివల్ల రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రపంచ పటంలోకి ఎక్కుతుందని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేవారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ స్వేచ్ఛ కూడా కల్పిస్తున్నామని చెప్పారు. స్వేచ్చతో పాటు షరతులతో కూడిన కఠిన నిర్ణయాలు కూడా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఏదైనా కంపెనీ స్థలం అందజేసిన 15 రోజుల్లో పనులు ప్రారంభించకుంటే రోజుకు కొంత చొప్పున జరిమానా విధిస్తామని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *