మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు రచించిన ‘ఉనికి’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ప్రతిపక్షనేత జానారెడ్డి తదితరులు హాజరయ్యారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ మొదటి ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఉనికి పుస్తకం రచించిన విద్యాసాగర్ రావుకు నా అభినందనలు.. పుస్తకావిష్కరణకు నన్ను పిలవడం ఆనందంగా ఉంది.. విద్యాసాగర్ రావు పార్లమెంట్ సభ్యుడైనప్పటి నుండి నాకు తెలుసు. ఉనికి పుస్తక తొలి కాపీని నాకు అందించినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. హైదరాబాద్ దేశానికి చాలా ముఖ్యమైన నగరం. సైబర్ సిటీ, హైటెక్ సిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అనుకూలమని, హైదరాబాద్ ఇప్పుడు ఎడ్యుకేషన్ హబ్ గా మారిందని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు.
విద్యాసాగర్ రావు జీవితం పోరాటాలతో ముడిపడి ఉందని, ఆయన విలక్షణమైన రాజకీయ నాయకుడని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నమ్ముకున్న సిద్ధాంతం కోసం కట్టుబడి ఉంటారని కీర్తించారు. ఉద్యమకాలంలో విద్యాసాగర్ రావుతో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించిందని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర బిల్లు మీద ప్రణబ్ ముఖర్జీ సంతకం చేయడం మన అదృష్టమని, రాజ్యసభలో బిల్లు పాస్ అయినప్పుడు మేం పొందిన ఆనందం వెలకట్టలేనిదని సీఎం అన్నారు.
అనంతరం ప్రతిపక్షనేత జానారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య సంస్థలన్నింటినీ పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, బలహీన పడుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థకు ఉనికి పుస్తకం కొత్త శక్తినిస్తుందన్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావుతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని జానారెడ్డి చెప్పారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ అస్థిత్వం లేకుంటే వ్యక్తిత్వం ఉండదని, విద్యాసాగర్ రావు ఆలోచనా విధానమే ఆయనకు గుర్తింపు తెచ్చిందని, విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్ కావడం సంతోషంగా ఉందని ప్రశంసించారు.