నేడు సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలోని దామరచర్లలో నిర్మితమవుతున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్‌ప్లాంటు నిర్మాణపనుల పురోగతిని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. థర్మల్ పవర్ స్టేషన్‌లో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిపై విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సీఎం పరిశీలిస్తారు. రూ.29,965 కోట్లతో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే 5 యూనిట్లను పరిశీలిస్తారు.
ఇప్పటికే ప్లాంటులో రెండు యూనిట్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగతా మూడు యూనిట్లు 70 శాతం వరకు అయ్యాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లోగా మొదటి యూనిట్ ద్వారా 800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసేలా పనుల్లో వేగం పెంచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక టీఎస్ జెన్‌కో, బీహెచ్‌ఈఎల్ అధికారులతో సీఎం సమావేశమై అక్కడ జరుగుతున్న పనులపై సలహాలు, సూచనలు చేయనున్నారు.