ఐదురోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారమంతా బిజీబిజీగా గడిపారు. హైదరాబాద్ నుండి మంగళవారం బయలుదేరి వెళ్ళిన సీఎం కేసీఆర్ కు సింగపూర్ లోని రిట్జ్ కార్టన్ హోటల్ వద్ద ఎన్నారైలు ఘనస్వాగతం పలికారు. 22 వ తేదీన ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సుకు హాజరవ్వడానికి వెళ్లిన సీఎం సదస్సు జరిగే స్టేడియాన్ని ఉదయం 11 గంటల సమయంలో పరిశీలించిన అనంతరం మధ్యాహ్నం సింగపూర్ లోని ప్రముఖ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ డెవలప్మెంట్ సంస్థ జురాంగ్ టౌన్ కార్పొరేషన్ (జేటీసీ) కార్యాలయాన్ని సందర్శించారు.
గురువారం ఉదయం 11 గంటలకు సింగపూర్ హైకమిషనర్ తో, సాయంత్రం 4 గంటలకు విదేశాంగ మంత్రితో సమావేశమౌతారని సమాచారం. అదేవిధంగా సింగపూర్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశమై వారికి తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని వివరిస్తారు. 22 న జరిగే ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్న అనంతరం సాయంత్రం 5 గంటలకు సింగపూర్ ప్రభుత్వ పెద్దలతో సమావేశం కానున్నారు. 23 వ తేదీన సింగపూర్ పట్టణ అభివృద్ధి ప్రణాళికలను సమీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి 24 న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో సీఎం తో పాటు, ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్, సీఎంవో ప్రధాన కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కే ప్రదీప్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.