రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందున 2019లోనూ అధికారం మనదేనని, గెలిచే బాధ్యత నాకు వదిలేయండని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు చేసే ఏ విమర్శనైనా ధీటుగా తిప్పికొట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు.
దేశంలో ఏ ప్రభుత్వం చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.. ప్రజలకు జవాబుదారీగా ఉంటున్నాం.. ఎవరికీ భయపడాల్సిన అవసరరం లేదు. ప్రతి అంశానికీ ధీటుగా బదులిద్దాం.. ప్రతిపక్షాలు వద్దు అని పారిపోయేదాకా అసెంబ్లీ సమావేశాలు నడుపుదాం అని సీఎం చెప్పారు. గత అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బదులిస్తే ప్రతిపక్షాలు మళ్ళీ నోరెత్తలేదని, అదేవిధంగా ఈసారి కూడా ఆయా అంశాల మీద పూర్తిస్థాయి సమాచారంతో రావాలని శాసనసభ్యులకు సూచించారు. ప్రతిరోజూ వందశాతం హాజరు ఉండాలని, సభలో హుందాగా వ్యవహరించాలని, ఒకవేళ అటువైపునుండి అల్లరి చేష్టలు చేస్తే తగినరీతిలో స్పందించి సభ నడుపుకుందామని చెప్పారు.
అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభం అవుతాయని, ఆ తర్వాత 28 వరకు సెలవులు ఉంటాయని, తిరిగి 29వ తేదీ నుండి సమావేశాలు తిరిగి ప్రారంభం అవుతాయని కేసీఆర్ చెప్పారు. రైతు కుటుంబాలను మనం అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం.. నష్టపరిహారాన్ని దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రూ. లక్షన్నర నుండి రూ. 6 లక్షలకు పెంచామని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో 7 వేల మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ వివరాలు తమ వద్ద ఉన్నాయని, ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఆ కుటుంబాలకు ఏం చేశాయో ఆ వివరాలన్నింటినీ సేకరించామని సీఎం అన్నట్లు తెలిసింది.
రైతులకు కావాల్సిందల్లా చేస్తున్నాం.. కోతల్లేని కరెంట్ ఇస్తున్నాం.. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాం.. అయినా కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే మన రాష్ట్రంలోనే కాదు దేశమంతా ఇదే పరిస్థితి ఉంది. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అయితే సీపీఎం పార్టీ మాత్రం ఇక్కడే ఆందోళన చేయడంలో వేరే ఉద్దేశం ఉన్నట్లు తెలిసింది. టీడీపీకి వత్తాసు పలుకుతూ సీపీఎం అలా వ్యవహరిస్తుంది. ఆ పార్టీ రాష్ట్ర విభజన విషయంలోనూ అట్లాగే వ్యవహరించింది. ఇప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా పార్టీని ఇరుకున పెట్టేందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని కేసీఆర్ తెలిపారు.