శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి అధికారులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని విస్మరించిన గత పాలకులు మూసీ నదిని మురికికూపంగా మార్చారని, మూసీని పూర్తిగా ప్రక్షాళన చేసి తిరిగి మంచినీరు పారే నదిగా మార్చాలని అన్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని, మూసీ నది ప్రక్షాళనకు ఏం చేయాలో ఒక మాస్టర్ ప్లాన్ ను వీలైనంత త్వరగా తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
నగరంలో మంచినీటి కొరత అనేది ఉండకూడదని, నగర శివారు ప్రాంతాలతో పాటు నగరం అంతటా ప్రజలకు సరిపడా మంచినీటిని సరఫరా చేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని, హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా మార్చేందుకు కార్యాచరణ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధిని రెండు రకాలుగా చూడాలని, ఔటర్ రింగ్ రోడ్డు లోపల, బయట ఏవిధంగా అభివృద్ధి చేయాలి? పూర్తి అభివృద్ధి ఏవిధంగా జరుగుతుంది? అనే విషయాల్లో స్పష్టత ఉండాలని సీఎం పేర్కొన్నారు.
ఇదిలాఉండగా స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించడానికి ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలను సరఫరా చేయాలని ఇటీవల సీఎం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈనెల 9న మధ్యాహ్నం 2 గంటలకు నెక్లెస్ రోడ్డులో జరిగే కార్యక్రమంలో చెత్తబుట్టలను సీఎం కేసీఆర్ పంపిణీ చేయనున్నారు. అలాగే ప్రతి ఇంటినుండి చెత్తను తరలించడానికి 2 వేల ఆటోలను కూడా జీహెచ్ఎంసీ సిద్ధం చేసింది.డ్రైవర్ కమ్ ఓనర్ పద్ధతిలో రూ. 4 లక్షలు విలువ చేసే ఈ ఆటోలను కేవలం రూ. 40 వేలు చెల్లించిన వారికి ఇస్తున్నారు.