దేశ ఆర్ధిక వ్యవస్థలో వ్యవసాయ రంగం అత్యంత కీలకమైందని, ఇది లాభదాయకం కాదనే వ్యతిరేక ధోరణితో చూసే విధానంలో మార్పు రావాలని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం నాబార్డ్ ఛైర్మన్ గోవిందరాజులు చింతల తో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మనదేశంలో ఎక్కువమంది ఆధారపడుతున్న రంగం వ్యవసాయ రంగం అని, భారతదేశంలో సుమారు 15 కోట్ల కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. వ్యవసాయం కూడా ఎటుపడితే అటు నడుస్తుందని, దీన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకుపోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో ఏ ప్రాంతానికి ఏ పంటలు అనుకూలమో గుర్తించి వాటినే సాగుచేయాలి. వ్యవసాయ ఉత్పత్తులకు అనుగుణమైన మార్కెటింగ్ విధానం కూడా ఉండాలని సూచించారు.
దేశంలోని 135 కోట్ల మందికి అన్నం పెట్టేది వ్యవసాయదారులే.. ఇంత జనాభా కలిగిన దేశానికి మరే దేశం కూడా తిండి పెట్టలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయం సమృద్ధి సాధించాలి. దీంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆహార అవసరాలు గుర్తించి మన దేశం నుండి ఎగుమతి చేసే విధానం రావాలి. ఇందుకోసం నాబార్డ్ అధ్యయనం చేయాలని కేసీఆర్ కోరారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కూలీల కొరత అని, ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి వ్యవసాయంలో యాంత్రీకరణ జరగాలని, నాటు వేసే యంత్రాలు, కలుపు తీసే యంత్రాలు, వరికోత యంత్రాలు అధిక సంఖ్యలో రావాలన్నారు. రైతులే పంటలు ప్రాసెస్ చేసి అమ్మేలా యంత్రాలు అందించాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లను పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం నాబార్డ్ అవసరమైన ఆర్ధిక చేయూత అందించే కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని కేసీఆర్ కోరారు. ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కో ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ రవీందర్ రావు, పలువురు ఎమ్మేల్యేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.