mt_logo

టీఎస్ఐపాస్ పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంసల జల్లు!!

వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమంపై గురువారం అన్ని రాష్ట్రాల పరిశ్రమల శాఖా మంత్రులతో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ఐపాస్ పై పీయూష్ గోయల్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ విధానానికి సంబంధించి సమగ్ర సమాచారం తమకు అందించాలని, దీనిపై అధ్యయనం చేస్తామని అన్నారు. అనంతరం రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్ మాట్లాడుతూ భారతదేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది నిజమైన ఆత్మనిర్భర్ కావాలంటే భారీగా వసతులు కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపడుతున్న భారీ పారిశ్రామిక పార్కులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని కోరారు.

టీఎస్ఐపాస్ విధానం ద్వారా గత ఆరు సంవత్సరాలుగా తమ ప్రభుత్వం భారీస్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నదని, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ హైదారాబాద్ ఫార్మాసిటీ, దేశంలోనే అతి పెద్దదైన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, హైదరాబాద్ మెడికల్ డివైజెస్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు కేటీఆర్ వివరించారు. జాతీయ ప్రాధాన్యం ఉన్నందున వీటి అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు.

అంతేకాకుండా హైదరాబాద్ నగరం భారతదేశంలోనే బల్క్ డ్రగ్ క్యాపిటల్ గా ఉందని, మరోవైపు పెద్ద ఎత్తున వ్యాక్సిన్లను తయారుచేస్తూ ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్ గా కూడా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో మరింత అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలను ఏర్పాటుచేసిన నేపథ్యంలో కేంద్ర పరిశ్రమల శాఖ సూచించిన ఒక జిల్లా ఒక ప్రోడక్ట్ కార్యక్రమానికి సంబంధించి తమ అభిప్రాయాలను కూలంకశంగా చర్చిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *