రాష్ట్ర వైద్య, విధాన పరిషత్ లో పనిచేస్తున్న 297 మంది ఔట్ సోర్సింగ్ పోస్టులకు సీఎం కే చంద్రశేఖర్ రావు అనుమతి ఇచ్చారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పోస్టులకు అనుమతి లేకున్నా ఈసీజీ టెక్నీషియన్స్, లాబ్ టెక్నీషియన్స్, సెక్యూరిటీ గార్డులు, ఇతర సాంకేతిక నిపుణులను నియమించుకున్నారు. ఈ సంస్థకు వచ్చే నిధుల్లో నుండి వీరందరికీ వేతనాలు ఇచ్చేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పోస్టులు లేకున్నా ఉద్యోగులను ఎట్లా నియమించుకుంటారని ఆర్ధికశాఖ నిధులను ఆపివేయడంతో సంవత్సర కాలంగా వారికి వేతనాలు అందడం లేదు.
టీఎస్ వీపీపీలో పనిచేస్తున్న పలువురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ సర్కార్ స్పందించి 297 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అనుమతి ఇచ్చేందుకు అంగీకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళూ లేని పోస్టుల్లో పనిచేస్తూ ఏ క్షణంలో ఉద్యోగాలనుండి తీసేస్తారో తెలీక అభద్రతకు గురయ్యామని, ఇప్పుడు పోస్టులు ఇవ్వడంతో భరోసాగా ఉంటామని వారు పేర్కొన్నారు.