మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే, దివంగత కృష్ణారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ శాసనసభలో స్పీకర్ అనుమతితో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అందరితో కలుపుగోలుగా మాట్లాడే వ్యక్తి కృష్ణారెడ్డి అని, ఆయనతో తనకు నలభై ఏళ్ల అనుబంధం ఉందని గుర్తుచేశారు. కృష్ణారెడ్డి మృతి బాధాకరమని, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. అనంతరం ప్రతిపక్షనేత, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ కృష్ణారెడ్డి గొప్ప నాయకుడని, అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగిన వ్యక్తి ఆయనని గుర్తుచేశారు.
మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణారెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధికోసం ఎనలేని కృషి చేశారని, ప్రజా సమస్యలపై మంచి సలహాలు ఇచ్చే వారని గుర్తు చేశారు. బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ కృష్ణారెడ్డి లేని లోటు సభలో కనపడుతుందని, సర్పంచ్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆయనని తెలిపారు. సభలో ఇతర సభ్యులు కూడా కృష్ణారెడ్డి మృతి పట్ల సంతాపం తెలుపగానే శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈనెల 29కి వాయిదా పడ్డాయి.