దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డుకు ఎంపికైన రాష్ట్ర యువ బాక్సర్ నిఖత్ జరీన్‌తో పాటు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిభకు తగిన గుర్తింపునిస్తూ కేంద్ర క్రీడాశాఖ నిఖత్, శ్రీజను అర్జునకు ఎంపిక చేయడంపై బుధవారం ఒక ప్రకటనలో ఆయన హర్షం వ్యక్తం చేశారు.
నిఖత్, శ్రీజను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘మహిళల బాక్సింగ్‌లో అద్భుత విజయాలతో దేశానికి మరింత ఖ్యాతి తీసుకొచ్చావు. అర్జున అవార్డు దక్కించుకోవడానికి అర్హురాలివి. ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌తో పాటు కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకంతో తెలంగాణ బిడ్డగా యావత్ దేశం గర్వపడేలా చేశావు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. టేబుల్ టెన్నిస్‌లో శ్రీజ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నది. కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీకి దిగిన తొలిసారే పసిడి పతకంతో సత్తాచాటావు. శరత్‌కమల్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో దేశానికి పతకాన్ని అందించావు. అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ శ్రీజ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. మరోవైపు ఈ సందర్భంగా నిఖత్, శ్రీజకు క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక అభినందనలు తెలిపారు.