ప్రముఖ కవి, శాసన మండలి సభ్యుడు గోరెటి వెంకన్నకు ప్రతిష్టాత్మక ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 2021’ దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ‘వల్లంకి తాళం’అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా గోరెటి వెంకన్నకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
దైనందిన జీవితంలోని ప్రజా సమస్యలను సామాజిక తాత్వికతతో కండ్లకు కడుతూ వెంకన్న అందించిన సాహిత్యం ప్రపంచ మానవుని వేదనకు అద్దం పడుతుందని సీఎం అన్నారు. మానవ జీవితానికి, ప్రకృతికి వున్న అవినాభావ సంబంధాన్ని.. మనిషికి ఇతర జంతు పక్షి జీవాలకు వున్న అనుబంధాన్ని గోరెటి వెంకన్న అత్యున్నతంగా ఆవిష్కరించారని సీఎం కొనియాడారు. తెలంగాణ మట్టి వాసనలను తన సాహిత్యం ద్వారా గోరెటి వెంకన్న విశ్వవ్యాపితం చేశారని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా తన సాహిత్యం ద్వారా గొప్ప పాత్ర పోశించారని తెలిపారు, గోరెటి సాహిత్యానికి దక్కిన ఈ ప్రతిష్టాత్మక సాహితీ గౌరవం.. తెలంగాణ మట్టి మనిషి జీవనతాత్వికకు దక్కిన గౌరవంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే ’బాల సాహిత్య పురస్కారం‘ విభాగంలో… ‘నేను అంటే ఎవరు ? అనే నాటక రచనకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు దక్కిన దేవరాజు మహారాజుకు, యువ పురస్కారం’ విభాగం కింద ’దండ కడియం’ సాహిత్యానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు దక్కిన తగుల్ల గోపాల్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గోరటి వెంకన్న, దేవరాజు మహారాజు, తగుల్ల గోపాల్… ముగ్గురు తెలంగాణ బిడ్డలకు కేంద్ర సాహిత్య అవార్డు దక్కడం ఆనందంగా వున్నదని సీఎం తెలిపారు. సాహిత్యానికి సంబంధించిన మూడు విభాగాల్లో తెలంగాణకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అభించడం, తెలంగాణ సాహితీ గరిమను మరోసారి ప్రపంచానికి చాటిందని సీఎం అన్నారు.