మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తన తరపున, తెలంగాణ ప్రజల తరపున ప్రణబ్ కు నివాళి అర్పించారు. ప్రణబ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రణబ్ మరణం తీరని లోటు అని, తెలంగాణతో ఆయనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకోసం వేసిన కమిటీకి నాయకత్వం వహించారని, చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై రాష్ట్రపతి హోదాలో సంతకం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ లో న్యాయం ఉందని ఆయన భావించేవారని, తాను ఆయనను కలిసిన పలు సందర్భాల్లో ఎన్నో విలువైన సూచనలు చేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నాయకుడికి ఉద్యమాన్ని ప్రారంభించి విజయతీరాలకు చేర్చే అవకాశం అరుదుగా వస్తుందని, ఆ ఘనత మీకు దక్కిందంటూ తనను ప్రత్యేకంగా అభినందించారని కేసీఆర్ గుర్తుచేశారు.
ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘ది కొలిషన్ ఇయర్స్’ అనే పుస్తకంలో కూడా రెండు చోట్ల తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని, కేసీఆర్ కు తెలంగాణ అంశమే తప్ప పోర్టుఫోలియో అవసరం లేదని పేర్కొన్నారని చెప్పారు. దీనినిబట్టి ప్రణబ్ ముఖర్జీ తన జీవితకాలంలో తెలంగాణ అంశాన్ని అత్యంత ప్రాధాన్యమైనదిగా గుర్తించారని అర్ధం అవుతున్నదన్నారు. గతంలో యాదాద్రి దేవాలయం సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను అభినందించారని తెలిపారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపంగా వారంపాటు పార్టీ కార్యక్రమాలేవీ చేపట్టరాదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో వారంపాటు సంతాపదినాలుగా పాటిస్తున్నందున పార్టీ కార్యక్రమాలు ఏవీ నిర్వహించకుండా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.