mt_logo

మామునూర్ విమానాశ్రయ స్థలాన్ని పరిశీలించిన ఎర్రబెల్లి..

మామునూర్ విమానాశ్రయ స్థలాన్ని పచాయితీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం సందర్శించారు. మంత్రి ఎర్రబెల్లి వెంట ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎయిర్ పోర్ట్ అధికారులు, ఇతర నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ నాయకత్వంలో జిల్లాలో ఎయిర్ పోర్టు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్ తర్వాత వరంగల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మామునూర్ విమానాశ్రయ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున భూ స్వభావ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విమానాశ్రయ ఏర్పాటు కోసం 1140 ఎకరాల స్థలం కావాలని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారని, 700 ఎకరాల స్థలం ఉందని, మిగతా స్థలం రైతుల నుండి కొనుగోలు చేయడానికి కృషి చేస్తున్నామని మంత్రి చెప్పారు.

అంతకుముందు వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలోని విఘ్నేశ్వరుని మండపంలో వినాయకునికి మంత్రి పూజలు నిర్వహించి మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మన ఆచార సంప్రదాయాలకు ఎంతో ప్రాముఖ్యం ఉందని, ఈ ప్రాంతం సర్వమత సమ్మేళనాలకు నిలయమని, ఈ సంవత్సరం కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా జరుపుకుంటున్నామన్నారు. ప్రజలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *