దేశ వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. మసీదులన్నీ ముస్లిం సోదరులతో నిండగా, ఈద్గాల వద్దకు చేరుకున్న ముస్లిం సోదరులు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని జామా మసీదు, ఫతేపురి మసీదుతో సహా అన్ని మసీదులూ విద్యుత్ దీపాలంకరణతో మెరిసిపోతున్నాయి. రాజకీయ నేతలు ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్ బక్రీద్ పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ సలీం ఇంట్లో విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, పద్మారావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇదిలాఉండగా విద్యుత్ కోతలతో సమస్యలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వం 14 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. నేషనల్, సదరన్ గ్రిడ్ నుండి యూనిట్ కు రూ. 8.50 పైసల చొప్పున కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.