తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. భారత రాష్ట్ర సమితి జెండాను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేడీఎస్ చీఫ్ కుమార స్వామి, సినీ నటుడు ప్రకాశ్ రాజ్, ఆయా రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు తదితరులు పాల్గొన్నారు. జెండాను ఆవిష్కరించిన సమయంలో తెలంగాణ భవన్ పటాకులు, డప్పులతో దద్ధరిల్లిపోయింది. జై కేసీఆర్, జై భారత్ నినాదాలు మార్మోగాయి. జెండా ఆవిష్కరణ కంటే ముందు బీఆర్ఎస్ పత్రాలపై కేసీఆర్ సంతకం చేశారు. అంతకు ముందు ముందు భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. దేశ పరివర్తన కోసమే భారత రాష్ట్ర సమితి ఏర్పడిందన్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు.. రాజకీయ పార్టీలు కాదన్నారు. దేశానికి ఇప్పుడు కొత్త ఆర్థిక విధానం అవసరమని చెప్పారు. జాతీయ స్థాయిలో కొత్త పర్యావరణ విధానం అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సాధికారికత కోసం కొత్త జాతీయ విధానం అమలు చేయాలన్నారు. రాబోయేది రైతు ప్రభుత్వమే అని సీఎం స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ పాలసీలు రూపొందిస్తామన్నారు. రైతుపాలసీ, జల విధానం రూపొందిస్తాం అని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ప్రచారం నిర్వహిస్తాం. కుమారస్వామి కర్ణాటక సీఎం కావాలన్నారు. నాలుగైదు నెలల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభమవుతుందన్నారు.