వచ్చే నెల 11 న జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు గురువారం ప్రకటించారు. ఇందులో ఏడుగురు సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ అవకాశం కల్పించారు. పార్టీ విధేయత, విజయావకాశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిసింది. అదే సమయంలో సామాజిక సమతూకం కూడా పాటించారు. ఎస్టీ, ఎస్సీల్లో ఉపకులాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఎస్టీల్లో ఆదివాసీ, లంబాడాలకు, ఎస్సీల్లో మాదిగ, నేతకాని వారికి సీట్లు కేటాయించారు. ఓసీల్లో కమ్మ, రెడ్లు, వెలమలకు సీట్లు కేటాయించారు. మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాలకు గానూ రెండింటిలో ఒకటి మాదిగలకు, ఒక స్థానంలో నేతకానివారికి అవకాశం కల్పించారు. బీసీ వర్గాలవారికి భువనగిరి, జహీరాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలను కేటాయించారు. మిగిలిన ఎనిమిది సీట్లలో ఐదుగురు రెడ్లు, ఒక కమ్మ, ఇద్దరు వెలమలకు అవకాశం దక్కింది.
పార్టీ ఎంపీ అభ్యర్థులుగా ఎంపికైన వారికి టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం శ్రీ కేసీఆర్ గురువారం బీ ఫారాలు అందజేశారు. ఎన్నికల్లో అందరినీ సమన్వయం చేసుకుని విజయం సాధించాలని వారికి సీఎం సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నామినేషన్లు దాఖలు చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ భారీ మెజార్టీతో గెలవాలని సీఎం వారికి చెప్పారు.