హైదరాబాద్ నగర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. భవిష్యత్‌లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రోను విస్తరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర సహకారం ఉన్నా లేకున్నా.. మెట్రోను విస్తరిస్తామని సీఎం స్పష్టం చేశారు. మైండ్ స్పేస్ – శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ పోలీసు అకాడమీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. మైండ్ స్పేస్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 31 కిలోమీటర్ల దూరం.. వందకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ, జీఎంఆర్ నిధులతో ప్రారంభం చేసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నానని కేసీఆర్ చెప్పారు.
“హైదరాబాద్ సుప్రసిద్ధమైన నగరం. ఒక సందర్భంలో దేశ రాజధాని ఢిల్లీ కంటే కూడా వైశాల్యంలో, జనాభాలో పెద్దదిగా ఉన్న నగరం హైదరాబాద్. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. హైదరాబాద్ నగరంలో చెన్నై కంటే దేశంలోని అనేక ఇతర నగరాల కంటే ముందుగా 1912లోనే ఎలక్ట్రిసిటీ వచ్చిన నగరం. మనకు 1912లో కరెంట్ వస్తే చెన్నై నగరానికి 1927లో అక్కడ కరెంట్ రావడం జరిగింది. చరిత్రలో నిజమైన కాస్మోపాలిటన్ సిటీగా అన్ని వర్గాలను, కులాలను, మతాలను, ప్రాంతాలను, జాతులను అందర్నీ అక్కున చేర్చుకోని అద్భుతమైనటువంటి విశ్వనగరంగా ఉన్న హైదరాబాద్ ఈ రోజు ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ కోసం మెట్రోకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మున్సిపల్, హెచ్ఎండీఏ, మెట్రో రైలు వారిని జీఎంఆర్ ఎయిర్‌పోర్టు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను” అని కేసీఆర్ పేర్కొన్నారు.
“హైదరాబాద్ నగరం చరిత్రలోనే గొప్పది కాదు. వర్తమానంలో కూడా చాలా గొప్పది. దేశంలో ఏ నగరంలో లేనటువంటి సమశీతల వాతావరణం ఉంది. భూంకపాలు రాకుండా, భూగోళం మీదనే సేఫేస్ట్‌గా ఉండే నగరం హైదరాబాద్. అన్ని భాషలు, సంస్కృతులు కలిగిన ఉన్నవారు ఉన్నారు. అనేక రాష్ట్రాలు, దేశాల నుంచి ఈ నగరంలో సహజీవనం సాగిస్తున్న సంగతి తెలుసు. గుల్జార్ హౌస్ వద్ద 300 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్రజలు ఉన్నారు. ఈ కల్చర్ మన సొంతం. గతంలో హైదరాబాద్ నగరం గొప్పగా ముందుకు పోలేదు. సమైక్య పాలకుల వల్ల చాలా బాధలు అనుభవించాం. మాకు కరెంట్ ఇవ్వండి, సరిపోవడం లేదు. ఇలాగె కరెంటు కోతలు కొనసాగితే వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతాం అని పారిశ్రామిక వేత్తలు ఇందిరా పార్కు వద్ద ధర్నాలు చేశారు. హైదరాబాద్‌లో ఏ బస్తీకి వెళ్లినా చాలా భయంకరమైన మంచినీటి బాధలు చూశాం. కృష్ణా, గోదావరి నుంచి నీటి సరఫరా పనులు నత్తనడకన నడిచాయి. అవన్నీ క్లియరెన్స్‌లు సాధించి మంచినీటి వసతి ఏర్పాటు చేసుకున్నాం. క్షణం పాటు కరెంట్ పోని పరిస్థితి చేసుకున్నాం. హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్‌గా మార్చాం. హైదరాబాద్ నగరం పవర్ సెక్టార్‌లో అనుసంధానం అయింది. న్యూయార్క్, లండన్, పారిస్‌లో కరెంట్ పోవచ్చు కానీ హైదరాబాద్‌లో మాత్రం కరెంట్ పోదు. ఇటువంటి అద్భతమైన నగరంగా తయారు అవుతోంది” అని కేసీఆర్ పేర్కొన్నారు.
“గొప్ప గొప్ప పరిశ్రమలు హైదరాబాద్‌లో కొలువుదీరుతున్నాయి. పరిశ్రమల రంగంలో ముందుకు దూసుకుపోతున్నాం. అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్ కష్టాలు తీర్చుకుంటున్నాం. ఆఫీస్ స్పేస్, రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనలు సడలించడంతో నిర్మాణం రంగం పుంజుకుంది. చాలా గొప్పగా ముందుకు పురోగమిస్తున్నాం. ఎయిర్‌పోర్టులో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. రెండో రన్ వే కూడా వస్తుంది. ఆ విధంగా ఈ మెట్రో రైలు కనెక్టివీటి ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసుకుని అందుబాటులోకి తీసుకువస్తాం.
పేదల ఆధీనంలో ఉన్న భూముల గురించి వెసులుబాటు కావాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కోరారు. ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తాం. కరోనా తగ్గినప్పటికీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. ప్రంపచంలో కాలుష్య రహితమైనటువంటి, ట్రాఫిక్ రద్దీని నివారించగలిగేటువంటి ఏకైక మార్గం మెట్రో. హైదరాబాద్ లో ఇంకా విస్తరించాల్సి ఉంది. బీహెచ్ఈఎల్ నుంచి మెట్రో రావాల్సి ఉంది. హైదరాబాద్ చుట్లూ మెట్రో రావాల్సి ఉంది. కేంద్రం సహకారం ఉన్నా లేకున్నా ఆ సౌకర్యాలు కలిగించుకుంటాం” అని కేసీఆర్ తెలిపారు.
“హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలు, మంత్రులు, ముందుకు పురోగమిస్తున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో మరిన్ని విజయాలు సాధించాల్సిన అవసరం ఉంది. అద్భుతమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేస్తుంది. ప్రపంచలోనే ఒక అద్భుతమైన నగరంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన ఉన్న హైదరాబాద్ ను మరింత తీర్చుదిద్దుతాం. పచ్చదనంలో మనం పురోగమించాం. వరల్డ్ గ్రీన్ సిటీ బెస్ట్ అవార్డు మనకే రావడం జరిగింది. ఇంకా ఎన్నో అవార్డులు హైదరాబాద్ సొంతం అయ్యాయి. ఫతుల్లాగూడలో నిర్మించిన స్మశాన వాటిక అద్భుతంగా ఉందని చెప్తే గర్వపడ్డాను. మనం ఎంత చేసినా ఇంకా తక్కువే. చాలా మంది లక్షల సంఖ్యలో హైదరాబాద్ జనాభాను పెంచుతున్నారు. తగురీతిలో మురుగునీటి, మంచినీటి సదుపాయాలు కల్పించుకోవాలి. జనాభా పెరుగులదకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించుకోవాలి. ప్రాథమిక అవసరాల్లో ముందు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం, ఆర్థిక ప్రేరణ ఇస్తుంది” అని కేసీఆర్ స్పష్టం చేశారు.
