mt_logo

తెలంగాణ ఆత్మతో ప్రాజెక్టులు కట్టుకోవాలి – సీఎం కేసీఆర్

ఆదివారం గోదావరి నదిపై ఏరియల్ సర్వే జరిపిన అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దేవాదుల అతిథిగృహంలో సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, సాగునీటి నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గోదావరి నదిపై నిర్మించే ప్రతి ప్రాజెక్టునూ తెలంగాణ ఆత్మతో ఆలోచించి తెలంగాణ దృష్టితో కట్టుకోవాలని అన్నారు. గోదావరి నదిలో ప్రవహించే ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

నిర్మాణంలో ఉన్నదైనా, నూతనంగా చేపట్టేదైనా ప్రాజెక్టులన్నీ తెలంగాణను సస్యశ్యామలం చేసి భవిష్యత్ తరాలకు కూడా శాశ్వత ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. ఇష్టారాజ్యంగా నిర్మించే ప్రాజెక్టుల వల్ల కలిగే ఇబ్బందులకు దేవాదుల ప్రాజెక్టును ఉదాహరణగా తీసుకోవాలని, వేలకోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు కూడా నీరందని దుస్థితి నుండి గుణపాఠం నేర్చుకోవాలని అన్నారు. లోపాలన్నీ సవరించుకున్నప్పుడే తెలంగాణ హరిత తెలంగాణగా, బంగారు తెలంగాణగా మారుతుందన్నారు. దుమ్ముగూడెం టెయిల్ పాండ్ రాష్ట్రానికి ఉపయోగపడదని, దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులను రీ సర్వే చేయాలని, కంతనపల్లి దగ్గర మరో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని సీఎం నిర్ణయించారు. దేవాదుల, ఇచ్చంపల్లి, మెట్టగడ్డ ప్రాంతాల్లో కొత్త బ్యారేజీలు నిర్మించాలని కేసీఆర్ ప్రతిపాదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *