mt_logo

సీఎం క్యాంపు కార్యాలయం మీద అస్తిత్వ పతాక

-బేగంపేట అధికారిక నివాసంలోకి సీఎం కేసీఆర్
-శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసిన ముఖ్యమంత్రి
-ఆంధ్ర దురహంకారపు ఆఖరి ప్రతీక తెలంగాణ వశం

బేగంపేట క్యాంపు కార్యాలయం… ఒకనాడు తెలంగాణకు అడ్డంగానూ, నిలువుగానూ అడ్డుపడ్డ రాజశేఖరరెడ్డి దురహంకరించిన చోటు.. తెలంగాణ జెండా ఎత్తిన ఎమ్మెల్యేలను మాయచేసి కొనుగోలు చేసిన తావు.. కిరణ్‌కుమార్ రెడ్డి వారానికో విలేకరుల సమావేశం పెట్టి తెలంగాణ మీద టన్నుల కొద్దీ విషం కక్కిన చోటు.. మ్యాపులు ముందు పెట్టి లెక్కల పైత్యం ప్రదర్శించిన చోటు.. వందమంది సీమాంధ్ర ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రం వద్దేవద్దంటూ తీర్మానాలు చేసి కుట్రలు, కుతంత్రాలకు మంత్రాంగం నడిపిన అంతఃపురం.. తెలంగాణ నడిబొడ్డు మీద బిచాణా వేసి ఈ నేల మీద, ఈ జాతి మీద, ఈ ప్రజల మీద కాడిమోపి దోపిడీ రాజ్యం నడిపిన ఆ ఆంధ్ర అహంకారపు ఆఖరి ప్రతీక మీద ఇపుడు తెలంగాణ ఆత్మగౌరవం విజయపతాకమై రెపరెపలాడుతోంది. మౌంట్ బాటన్‌ను దింపేసి రాజగోపాలచారి గవర్నర్ జనరల్ సీటులో కూర్చున్నట్టున్నది తెలంగాణ ముఖ్యమంత్రి ఆ ఇంటిలో అడుగుపెడుతున్న దృశ్యం చూస్తుంటే.. నూరుమంది కౌరవులను సంహరించి హస్తిన పీఠం మీద ధర్మజుడు పట్టాభిషిక్తుడైనట్టుంది..కేసీఆర్ గృహప్రవేశ సంరంభం చూస్తుంటే. అవును ఇది మన రాష్ట్రం.. అవును ఆయన మన సీఎం.. అవునవును అది మన ముఖ్యమంత్రి నివాసం. ఆంధ్రం ఇక గతం..ఆంధ్రపాలన ఇక గతించిన చరిత్ర.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బేగంపేటలోని అధికారిక నివాసంలోకి ఆదివారం గృహప్రవేశం చేశారు. బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి ఉదయమే కుటుంబసభ్యులతో కలిసి ఆయన బేగంపేటకు చేరుకున్నారు. వేద పండితులు నిర్ణయించిన సుముహూర్తం ఉదయం 10:48 నిమిషాలకు ఆయన కుటుంబసభ్యులతో కలిసి గృహంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా సుదర్శనయాగం, వాస్తుదోష పూజ నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జాము నుంచే రుత్వికులు, వేదపండితులు, శ్రీవైష్ణవాచార్యులు శాస్ర్తోక్తంగా వివిధ పూజలు నిర్వహించారు. వరంగల్‌కు చెందిన ప్రహ్లాదాచారి నేతృత్వంలో 20 మంది శ్రీ వైష్ణవ ఆచార్యులు దుష్టగ్రహాలు, అరిష్టాలు తొలిగిపోవాలని, విజయాలు చేకూరాలని ఆకాంక్షిస్తూ ఘనంగా హోమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ తన గురువు మృత్యుంజయశర్మకు పాదాభివందనం చేసి ఆశీర్వచనం పొందారు. కేసీఆర్ కుమారుడు ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు దంపతులు, కూతురు నిజామాబాద్ ఎంపీ కవిత, అనిల్ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులతో పాటు నమస్తే తెలంగాణ సీఎండీ లక్ష్మీరాజం, డైరెక్టర్ విజయరాజం, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్ నాయకుడు దామోదర్‌రావు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి , గంప గోవర్ధన్, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కేటీఆర్ క్యాంపు కార్యాలయంగా పాత ఇల్లు..
ప్రస్తుతం కేసీఆర్ నివాసం ఉంటున్న నందినగర్‌లోని ఇంటిని ఐటీ, పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తన క్యాంపుకార్యాలయంగా వినియోగించుకోనున్నారు. బేగంపేటలోని నివాసంలో ముఖ్యమంత్రితో పాటు కేటీఆర్ కూడా నివసించనున్నారు. నందినగర్ నివాసానికి మాత్రం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10గంటల వరకు వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించినట్లు తెలిసింది. తొలుత బేగంపేట అధికారిక నివాసంలోకి మారేందుకు ముఖ్యమంత్రి విముఖత చూపారు. దీంతో కుందన్‌బాగ్‌లో ప్రత్యామ్నాయ క్వార్ట్టర్లను అధికారులు సిద్ధంచేశారు. అయితే వాటిని సందర్శించిన సీఎం ఆసంతృప్తి వ్యక్తం చేయటంతో విషయం మళ్లీ మొదటికి వచ్చింది. చివరికి బేగంపేటలోని అధికారిక నివాసానికి వాస్తు మార్పులు చేయించాలనే కేసీఆర్ సూచన మేరకు అధికారులు మార్పులు చేశారు. గృహ ప్రవేశానికి పండితులు ముహూర్తం ఖరారు చేశారు.

ఈ మేరకు ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి అధికారిక నివాసంలోకి కేసీఆర్ మారారు. ప్రస్తుత నివాసం తన అధికారిక కార్యక్రమాలకు అనువుగా లేకపోవడం, భారీగా వస్తున్న వాహనాలకు సరైన పార్కింగ్ సౌకర్యంలేక ఇరుగుపొరుగుకు తీవ్ర ఇబ్బందులు ఎదరవుతుండడంతో బస మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. బేగం పేటలోని క్యాంపు కార్యాలయాన్ని 2004లో అధునాతన సౌకర్యాలతో, రెండెకరాల విశాలమైన స్థలంలో నిర్మించారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *