mt_logo

సీఎం తీరు ఆంధ్రా దురహంకారానికి పరాకాష్ఠ

48 గంటల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభమవ్వాల్సి ఉండగా మంత్రి డి. శ్రీధర్‌బాబు శాఖ మార్చడం ద్వారా సీఎం ప్రవర్తిస్తున్న తీరు ఎంతో నీచమైన, హేయమైన చర్యగా తెలంగాణ వాదులు అభివర్ణిస్తున్నారు. ఇప్పుడున్న శాసనసభా వ్యవహారాల శాఖను మంత్రి శైలజానాథ్ కు అప్పగించి, వాణిజ్య పన్నుల శాఖను మంత్రి శ్రీధర్‌బాబు కు అప్పగించడం ద్వారా తనకున్న సీమాంధ్ర దురహంకారాన్ని మరోసారి బయట పెట్టారు సీఎం కిరణ్. ఇదిలా ఉండగా సీమాంధ్రకే చెందిన వట్టి వసంతకుమార్ ను తెలుగు భాష, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా నియమించారు. శాసనసభ ప్రోరోగ్, విభజన ముసాయిదా బిల్లుపై చర్చ మంత్రి శ్రీధర్‌బాబు మొదలుబెట్టడాన్ని సహించలేని ముఖ్యమంత్రి ఇలా చేయడాన్ని పలువురు టీ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జనవరి 3నుండి ప్రారంభం కానున్న సమావేశాల్లో సీమాంధ్రకు చెందిన నాయకులు వాయిదా తీర్మానాన్ని ప్రవేశబెట్టాలని ప్రయత్నిస్తున్నారనే వార్త తెలిసిన అన్నిపార్టీలకు చెందిన టీ నేతలు తీవ్రంగా ప్రతిఘటిస్తారని, తద్వారా సభను జరక్కుండా అడ్డుకొని ప్రోరోగ్ చేయాలని సీఎం కిరణ్ ఈ నిర్ణయం తీసుకోవడం యావత్ తెలంగాణ ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది. శాసనసభా వ్యవహారాలు సీమాంధ్రకు సంబంధించిన వ్యక్తి చేతిలో ఉంటే తాము చెప్పినట్లు జరుగుతుందని, సభలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలనే ఉద్దేశ్యం సీఎంకు  ఉన్నట్లు పలువురి భావన. తెలంగాణ ప్రజలను మానసికంగా బలహీనుల్ని చేయడమే సీఎం కిరణ్ వ్యూహమని టీకాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఉపేక్షించేది లేదని, సాధ్యమైనంత త్వరగా ఈ విషయాన్ని తేల్చుకోవాలని అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు మంత్రి శ్రీధర్‌బాబుకు అండగా నిలిచారు. కొంతమంది టీకాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం. మంత్రి శ్రీధర్‌బాబు శాఖ మార్పు గురించి తెలియగానే కరీంనగర్ బంద్‌కు టీకాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. శ్రీధర్‌బాబు కూడా ఈ విషయంపై తాడోపేడో తేల్చుకోవాలని చూస్తున్నట్లు తోటిమంత్రులతో చెప్పినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *