mt_logo

హైదరాబాద్ లో రూ. పది కోట్లతో క్రైస్తవ భవన్

నగరంలో క్రిస్టియన్లకు ప్రత్యేక క్రైస్తవ భవన్ ను పది కోట్ల రూపాయలతో నిర్మించి ఇస్తామని, వచ్చే సంవత్సరం ఆ భవన్ లోనే క్రిస్మస్ వేడుకలు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ నెలలోనే భవనానికి శంకుస్థాపన ఉంటుందని, దీనికి సంబంధించి జీవోను శుక్రవారమే విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. మంచి ఆర్కిటెక్చర్ తో అంతర్జాతీయ స్థాయిలో భవన నిర్మాణం ఉంటుందని, నిర్మాణ బాధ్యతలు మొత్తం డిప్యూటీ సీఎం రాజయ్యకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా క్రిస్మస్ సందర్భంగా రెండు రోజులు సెలవులు ప్రకటిస్తామని, జనవరి 1ని కూడా సెలవుగా ప్రకటిస్తామని సీఎం పేర్కొన్నారు.

గురువారం రాత్రి పబ్లిక్ గార్డెన్స్ లోని లలిత కళాతోరణంలో నిర్వహించిన యునైటెడ్ క్రిస్మస్- 2014 వేడుకల్లో సీఎం కేసీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొని పావురాలు, బెలూన్లు ఎగురవేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, గతంలో క్రిస్మస్ పండుగకు ఒక్కరోజు సెలవు ఉండేదని, తమ ప్రభుత్వం దానిని రెండు రోజులకు పెంచిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో దళిత క్రిస్టియన్లను దళితులతో సమానంగా చూస్తామని, క్రిస్టియన్లకు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అన్ని అవకాశాలు, హాస్టల్, స్కాలర్ షిప్ వంటివి దళిత క్రిస్టియన్లకు అమలు చేస్తామని అన్నారు.

క్రిస్టియన్లకు శ్మశానవాటికల కోసం స్థలాలు అడిగారని, పట్టణాన్ని ఆనుకుని కొన్ని భూములున్నాయని, రెవెన్యూ అధికారులతో మాట్లాడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి సమాధుల కోసం స్థలాలు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. క్రైస్తవుల కోసం ఒక బోర్డును ఏర్పాటు చేస్తామని, దీనిద్వారానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కొన్ని అసాంఘిక శక్తులు క్రైస్తవ ఫాదర్లు, పాస్టర్స్ పై దాడులు చేయడాన్ని తాను ఖండిస్తున్నానని, దాడులు నియంత్రించాలని ఆదేశాలు ఇచ్చానని స్పష్టం చేశారు. క్రీస్తు జన్మించడమే ప్రేమకోసం అని, ఆయన సందేశం ఎప్పుడూ స్మరించుకునేదేనని, తెలంగాణ రాష్ట్రంలో మొదటి క్రిస్మస్ వేడుకలు ఆనందోత్సవాల మధ్య వైభవంగా జరుపుకోవాలని కేసీఆర్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *