mt_logo

చిదంబరం ఏం జెప్పిండు, నువ్వేం రాశినవ్ రాధాకృష్ణా?

[Note: కొంతమంది మిత్రులు ఏదో ఆంగ్ల పత్రిక కూడా అలాగే రాసింది కదా అని అనుమానం వ్యక్తపరిచారు. పరిశీలించి చూస్తే ఆ పత్రికలన్నీ PTI ఫీడ్ తీసుకున్నాయని అర్థం అయ్యింది. చాలా చోట్ల PTI కి వార్తలు సమకూర్చేది స్థానిక దినపత్రికల్లోని విలేకరులే అన్నది గమనించాలి. చిదంబరం ఆ రోజు లోక్ సభలో తెలంగాణపై చేసిన మొత్తం ప్రకటన ఇక్కడ చదవండి http://missiontelangana.com/wp-content/uploads/2012/05/P-Chidambaram-Statement-on-Telangana-2nd-May-2012.pdf . ఇది చదివి మీరే నిజానిజాలు తెలుసుకోండి. లోక్ సభ వెబ్ సైటులో కూడా ఈ ప్రకటన ఉన్నది. మీరు అక్కడ కూడా సరిచూసుకోవచ్చు.]

—-

నిన్నటి చిదంబరం ప్రకటనను సీమాంధ్రజ్యోతి ఎంత చక్కగా వక్రీకరించిందో ఒకసారి చదవండి:

మిడ్నపూర్ ఎంపీ ప్రబోధ్ పండా అడిగిన ప్రశ్నలో తెలంగాణ విషయాన్ని ప్రస్తావించారు. ఆయన అడిగింది ఇది:

ప్రశ్న) తెలంగాణ విషయంలో హోం మంత్రి వైఖరి ఏమిటి? హోం మంత్రి స్వయంగా ఇచ్చిన ప్రకటన వల్లనే పరిస్థితి విషమించింది.  ఇప్పుడు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదంటే ప్రతిరోజూ సభకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. అందుకే హోం మంత్రి ఈ అంశంపై ఇప్పటికీ అదే వైఖరితోనే ఉన్నారా లేదా తన వైఖరి మార్చుకున్నారా స్పష్టం చేయాలి”

ఇదండీ సదరు సభ్యుడు అడిగిన ప్రశ్న. స్థూలంగా హోం మంత్రిత్వ శాఖపై అనేక విమర్శలు ఎక్కుపెట్టిన ఆ సభ్యుడు మీ తెలంగాణ ప్రకటన వల్లనే ఇదంతా జరిగింది అని చిదంబరం ను ఆడిపోసుకున్నారు.

దీనికి చిదంబరం ఇచ్చిన జవాబు ఇదీ:

“తెలంగాణ గురించి ఒక ప్రశ్న అడిగారు. కేంద్ర హోం మంత్రి ఏకపక్షంగా కొంతమంది ప్రెస్ వాళ్లను పిలిచి తెలంగాణ గురించి ఒక ప్రకటన చేయగలరని ఎవరైనా నమ్మితే, మీకు అసలు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో కూడా తెలియదన్నమాట. ఏ హోం మంత్రీ అలాంటి ప్రకటన చేయలేడు. ఏ పరిస్థితుల్లో ఆ ప్రకటన చేయవలసి వచ్చిందో అందరికీ తెలుసు. డిసెంబర్ 7, 2009 నాడు జరిగిన  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీ యొక్క బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తుతెచ్చుకోండి…”

స్థూలంగా డిసెంబర్ 9 నాటి ప్రకటన తానొక్కడు చేసింది కాదని. అలా చేయడం తనకే కాదు ఏ హోం మంత్రికీ సాధ్యం కాదని, అది ప్రభుత్వం సమష్టిగా తీసుకున్న నిర్ణయం అని చిదంబరం వివరణ ఇచ్చాడు.

కానీ వేమూరి రాధాకృష్ణ పచ్చజ్యోతి మాత్రం దీనికి తనదైన భాష్యం చెప్పుకుంది.

“ఎస్ ఆర్ నో చెప్పలేం – తెలంగాణపై తేల్చేసిన చిదంబరం” అని సంకలు గుద్దుకుంది. అక్కడితో ఆగకుండా ఒక “పచ్చ” అబద్ధాన్ని పిచ్చిగా రాసింది. రెండో హెడ్దింగుగా

“నేనే కాదు ఏ హోం మంత్రీ చెప్పలేరు” అని అచ్చోసి వదిలింది.

అయ్యా రాధాకృష్ణా! మరీ ఇంత బరితెగింపా? సాక్షాత్తూ దేశ హోం మంత్రి లోక్ సభలో ఒక ప్రకటన చేస్తే దానికి వీడియో సాక్ష్యాలు, నలుపు-తెలుపులో ఆయన ప్రకటన ప్రతి కూడా ఉన్నా మీరు వార్తలను ఇంత “పచ్చ”గా వక్రీకరిస్తారా?

తెలంగాణ ప్రజలు మీ సీమాంధ్ర మీడియాను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారని మరువకండి. బాధ్యతాయుతమైన పాత్రికేయ వృత్తిలో ఉండీ ప్రజలను తప్పుదోవపట్టించే ఇలాంటి వేషాలు మానుకోండి. లేకపోతే తెలంగాణ ప్రజలు మీ మీడియాకు త్వరలోనే మంగళం పాడుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *