ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో జరుగుతున్న జిల్లా టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు శ్రేయస్సు కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, జిల్లాను అభివృద్ధి చేసి అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సమైక్య పాలకులు ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేశారని, గత కాంగ్రెస్ పాలనలో ఆదిలాబాద్ జిల్లా నుండి మంత్రి లేడని అన్నారు. సీఎం కేసీఆర్ కు ఆదిలాబాద్ జిల్లా మీద అంతులేని ప్రేమని, జిల్లాకు ఇద్దరు మంత్రులను ఇచ్చారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఎకరం పారాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, బోథ్ నియోజకవర్గంలో చెరువులన్నీ పునరుద్ధరిస్తామని, గుప్తి ప్రాజెక్టు డీపీఆర్ రాగానే పూర్తిచేస్తామని హరీష్ చెప్పారు.
గత పాలకులు లోయర్ పెన్ గంగను పట్టించుకోలేదని, దీని ద్వారా బోథ్ నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని, కరెంట్ కోసం రూ. 91 వేల కోట్లు, ప్రాజెక్టుల కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. మిషన్ కాకతీయ ఫలాలు ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయని, చెరువులు నిండుతుంటే సంతోషం ఆగట్లేదు. చెరువులు నిండాలంటే చెట్లను విస్తారంగా పెంచాలని, అటవీ సంపద ఉంది కాబట్టే జిల్లాలో వానలు పడుతున్నాయని అన్నారు. ప్రాజెక్టులు కట్టని కాంగ్రెస్ నాయకులు రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడడం వింతగా ఉందని, టీడీపీకి కూడా రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని హరీష్ రావు మండిపడ్డారు.