mt_logo

చెరువుల పండుగ

-సంబురంలా పునరుద్ధరించుకుందాం..
-పాటరాస్తా.. తట్టమోస్తా
-ఏటా చెరువుల పునరుద్ధరణ వారోత్సవాలు
-కాకతీయులనాటి వైభవాన్ని తిరిగి తేవాలె
-చెరువుల పునరుద్ధరణ ద్వారానే అది సాధ్యం
-ఒక్కో చెరువుకు సగటున రూ.50 లక్షలు ఖర్చు
-చిన్న నీటిపారుదలశాఖ ఇంజినీర్లకు సీఎం దిశా నిర్దేశం

చిన్ననీటి చెరువుల పునరుద్ధరణ పేరుతో ఏటా వారోత్సవాలు జరుపుకొందామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఇక ఇందులో వేరే ముచ్చట కానీ, వేరే పేరు కానీ మార్చుడే లేదన్నారు. నీటిపారుదల ఇంజినీర్లు చెరువులను పునరుద్ధరిస్తరు కానీ చెరువుల పరిరక్షణ బాధ్యత ప్రజలే చూసుకోవాలని, అందుకు ప్రజలను ఒప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.

ఒక్కో ఏడాది కొన్ని చెరువులచొప్పున పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టి, వచ్చే ఐదేండ్లలో తెలంగాణలో చెరువులన్నీ నీళ్లతో కళకళలాడుతూ కాకతీయుల నాటి కాలం గుర్తుకు రావాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణపై చిన్ననీటిపారుదల శాఖ ఇంజినీర్లు, అటవీ శాఖ అధికారులతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్‌టీయూ ప్రాంగణంలోని ఆడిటోరియంలో సీఎం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

చెరువుల ప్రాధాన్యం ఏందనేది ప్రజలకు తెలియాలి. వారోత్సవాల సమయంలో నేను పది జిల్లాలకూ వస్త. పది తట్టల మట్టి మోస్త. రెండురోజులపాటు అందరం శ్రమిద్దం. నాతోపాటు మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ తట్టలెత్తుతరు. ఏందీ వీళ్లు ఎందుకు తట్టలు మోస్తండ్రు? అని అందరు చెప్పుకోవాలె. విద్యార్థులను కూడా ఇందులో భాగస్వాములను చేద్దం. రెండురోజులపాటు వాళ్లతో కూడా శ్రమదానం చేయిద్దం. ఇందుకోసం అద్భుతమైన క్యాసెట్ తయారు చేస్తన్నం.

కళాబృందాలను కూడా ప్లాన్ చేస్తున్నం. ఒక పాట నేనే రాసే ఆలోచన చేస్తున్న. ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలా, ఒక సంబురంలా చేస్తం అని సీఎం చెప్పారు. ఒక్కో చెరువుకు సగటున రూ.50 లక్షలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని సీఎం వివరించారు. అక్టోబర్ నెల మొత్తం తెలంగాణలోని చెరువులు, కుంటలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి పరిస్థితి ఏంది? మరమ్మతులకు ఎంత ఖర్చు అవుతుంది? తదితర వివరాలన్నీ సేకరించాలని సీఎం నీటిపారుదల ఇంజినీర్లకు సూచించారు. ప్రపంచంలో లేటెస్టు పనిముట్లు ఎక్కడ ఉన్నా తెప్పించి ఇచ్చే బాధ్యత మీది.

అందుకు ఎంత డబ్బులు కావాలో చెప్పండి.. ఇస్తం. మనవాళ్లకు మాత్రం లేటెస్టు ఎక్విప్‌మెంట్ ఇయ్యుండ్రి అని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌రావును సీఎం ఆదేశించారు. చెరువుల్లో పూడిక తీసే పని పక్కాగా జరగాలని, గతంలో నీరు-మీరు కార్యక్రమంలో లాగా పైపైన చేసి చేతులు దులుపుకుంటే నడవదని చెప్పారు. మొరం తగిలే వరకు వచ్చే మట్టిని రైతుల పొలాలకు తోలాలి. మొరం తగిలిన తర్వాత ఆ మట్టిని కట్టకు వాడాలి అని సూచించారు. వర్షం పడితే చెరువులు నిండేలా కార్యక్రమం ఉండాలని చెప్పారు.

కాకతీయల నాటి పూర్వవైభవం తేవాలి
నీటిపారుదలరంగం కాకతీయులనాటి వైభవాన్ని సంతరించుకోవాలి. అది నా కల, నా అభిలాష, నా ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత ప్రాధాన్యం ఇచ్చే రంగం నీటిపారుదల శాఖ అని, అందులోనూ చిన్ననీటిపారుదలకు మరిం ప్రాముఖ్యం ఇస్తున్నామని చెప్పారు. 11వ శతాబ్దంలో కాకతీయ, రెడ్డిరాజులకాలం నుంచే వాటర్‌షెడ్ ఉండేదని, తర్వాత వచ్చిన వారూ అదే కార్యక్రమాన్ని కొనసాగించారని అన్నారు. ఆ రోజుల్లో మూసీనది నుంచి నల్లగొండ జిల్లాలోని ఉదయ సముద్రం వరకు 77 కి.మీ.మేర గొలుసుకట్టు చెరువులుండేవని గుర్తుచేశారు.

1974 బచావత్ కేటాయింపులనాటికే గోదావరి బేసిన్లో 175 టీఎంసీలు, కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు 90 టీఎంసీలు.. మొత్తం 265 టీఎంసీల సామర్థ్యం కలిగిన చెరువులు మన దగ్గర ఉన్నాయని చెప్పారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో కలిసే నాటికే 20 లక్షల ఎకరాలు సాగులో ఉండేవని, అందులో 15 లక్షల ఎకరాలు చిన్ననీటిపారుదల శాఖ పరిధిలో ఉండేవన్నారు. భారీ నీటిపారుదల శాఖ పరిధిలో ఆ రోజుల్లో కేవలం నిజాంసాగర్ ఒక్క దాని కిందే 2.75 లక్షల ఆయకట్టు ఉన్నప్పటికీ, ఆ ప్రాంత ప్రజలు 3లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఉపయోగించుకునేవారని వివరించారు.

ఈపీసీల ముచ్చటే ఉండదు
గీ ఈపీసీ ఏంది? నాకు తెల్వక అడుగుతున్న! వాడెవడో ఈపీసీ తెచ్చేది ఏంది? మన ఇంజినీర్లు వాడు చెప్పింది వినుడేంది? కాంట్రాక్టర్ ముందు నడుస్తంటే మన ఇంజినీర్ వెనక నడవాల్న? ఇదెక్కడి న్యాయం? ఇకనుంచి అలాంటి ముచ్చటే ఉండదు. సర్వే చేయించుడు మీకు రాదా? ఎస్టిమేట్లు మీరు చేయలేరా? మొన్న మన మంత్రిగారిని చెరువుల లెక్కలు అడిగితే.. కచ్చితమైనవి లేవన్నారు. అప్పుడు అసలు లెక్క ఏంది? దీని కథ ఏంది? అని సర్వే చేయించమని చెప్పిన. మొన్న మీరు చేసిన సర్వే లెక్కలన్నీ నా దగ్గర ఉన్నయ్. ఇరిగేషన్ ట్యాంకులు 5411, పంచాయితీరాజ్ ట్యాంకులు 32,068, ఊట చెరువులు 4962, అటవీశాఖ చెరువులు 1229.. మొత్తం 45,300 చెరువులు ఉన్నయ్ అని సీఎం వివరించారు.

జీవన విధ్వంసం….
ఆంధ్రోళ్ల పాలనలో తెలంగాణలో జీవన విధ్వంసం జరిగిందని సీఎం చెప్పారు. తెలంగాణలో నీటిపారుదల వ్యవస్థను నిర్లక్ష్యం చేశారని, చిన్ననీటిపారుదల శాఖకు కొన్ని ఏండ్లపాటు నిధులు కేటాయించని దుస్థితి దాపురించిందని అన్నారు.

చెరువులను పట్టించుకునే నాథుడే లేకపోవడంతో, రైతులు కూడా వాటిపట్ల అశ్రద్ధ చూపారన్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి సంగతులను సీఎం గుర్తు చేసుకున్నారు. మే నెల మొదటివారంలో ఎండ్ల బండ్లుకట్టి చెరువుల్లో మట్టితీసకపోయేవాల్లు. ఫీడర్ చానల్‌ను శుభ్రం చేసుకునే వాల్లం. కట్టు కాలువ, పంట కాలువ అని రెండు ఉంటయ్. ఒకటి నీరు తెస్తది. ఇంకోటి నీరు ఇస్తది. వీటి గురించి ఈ రోజుల్ల ఎంత మందికి తెలుసు? అన్నారు. కరువు కాటకాలు, క్రిమిసంహార మందుల వాడకం ఎక్కువైన తర్వాత రైతులకు కూడా చెరువులపై సోయపోయిందన్నారు.

మరోవైపు బోరింగ్‌లపై ఆధారపడడం వల్ల చెరువుల వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధిక నీటి వనరులు ఉంటే, ఆ జిల్లాకు ఎస్‌ఈ పోస్టే లేకుండా చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తం 10 జిల్లాలకు పది ఎస్‌ఈ పోస్టులు మంజూరు చేశామని, అలాగే 42 మంది ఈఈ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. 147 డిప్యూటీ ఈఈ పోస్టులు భర్తీ చేయగా, ఏఈ పోస్టులు వాస్తవానికి 559 ఉండాల్సింది కాగా, ప్రస్తుతం 429 మందే ఉన్నారని సీఎం చెప్పారు. ఒక్కో మండలానికి ఒక్కో ఏఈతో ఇద్దరు వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాబోయే నాలుగైదేండ్లలో 50-70 వేల కోట్ల రూపాయలు నీటిపారుదల శాఖ ద్వారా ఖర్చు చేయనున్నట్లు సీఎం చెప్పారు.

నామినేషన్ పద్ధతిలో…
ఇంజినీరింగ్ డిపార్టుమెంట్‌కు రూ. 5లక్షల వరకు నామినేషన్‌పై ఇచ్చే అధికారాన్ని రెండు రోజుల్లో కల్పిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. అధికారులను నమ్ముదాం. 99 శాతం మంది మంచోళ్లే ఉంటరు. ఎవరో ఒకడు లఫంగా ఉంటడు అని వ్యాఖ్యానించారు. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఫైనాన్స్ కమిషన్ కూడా అభినందించిందని, కేంద్రంనుంచి కూడా నిధులు వచ్చే అవకాశముందని చెప్పారు. సగటున ఏటా 9060 చెరువులను పునరుద్ధరించుకోవాల్సి ఉందన్నారు. త్వరలోనే మేజర్ ఇరిగేషన్ ఇంజినీర్లతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తామని, తర్వాత ఇద్దరిని కలిపి మరో సమావేశం నిర్వహిస్తామని సీఎం తెలిపారు.

అటవీ శాఖలో సమన్వయం…
అటవీశాఖ పరిధిలో కొన్ని చెరువులు ఉన్నాయని, వారితో సమన్వయం చేసుకుని అడవుల్లో కూడా చెక్‌డ్యామ్స్ నిర్మించాలని సీఎం చెప్పారు. రాబోయే మూడేండ్లలో హరితహారంకింద తెలంగాణలో 230 కోట్ల మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం చెప్పారు. మనం నాటే మొక్కలతో వర్షం బాగా పడాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రంలో కరెంట్‌ను కూడా సొంతగా ఉత్పత్తి చేసుకునే విధంగా ప్రయత్నిస్తున్నామని, జెన్‌కో ఆధ్వర్యంలో 6వేల మెగావాట్లు, బీహెచ్‌ఈఎల్ ఆధ్వర్యంలో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయబోతున్నామని సీఎం చెప్పారు. రాబోయే కాలంలో రెప్పపాటు సమయం కూడా కరెంట్ పోనివ్వను అని సీఎం సభికుల హర్షధ్వనాల మధ్య వెల్లడించారు.

కార్యక్రమానికి నీటిపారుదల శాఖ ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే వ్యాఖ్యతగా వ్యవహరించగా, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ వినోద్, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, సీఎంవో అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, చిన్ననీటిపారుదల చీఫ్ ఇంజినీర్ రామకృష్ణ, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ రమేశ్, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ భాషనే ఉపయోగించుండ్రి
సమావేశం ప్రారంభంలో ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు ఇంగ్లీష్‌లో మాట్లాడారు. తర్వాత మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ రామకృష్ణ కూడా ఇంగ్లీష్‌లో నివేదికను సమర్పిస్తుండగా సీఎం జోక్యం చేసుకున్నారు. ఇక్కడ ఇంగ్లీషోళ్లు ఎవరున్నరు? ఎందుకని సెక్రటరీ, ఈఎన్‌సీ ఇంగ్లీష్‌లో మాట్లాడిండ్రు? తెలుగు రాదా? సక్కగా తెలుగులో మాట్లాడక ఇంగ్లీష్ ఎందుకు? మనం చెప్పేది చివరోళ్ల వరకు మంచిగ అర్థం కావాలె. సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్‌లో మాట్లాడం బంద్ చేయుండ్రి. వీలైతే తెలంగాణ భాషనే ఉపయోగించుండ్రి అని సీఎం అనడంతో హాలంతా చప్పట్లతో మారుమోగింది. మీరంతా మీ పోస్టుల్లో మంచిగా పని చేయుండ్రి. తబాదులు (బదిలీ) ఉండవ్. తబాదులంటే తెలుసుగా! కనీసం రెండేళ్లు మీకు తబాదులు ఉండవ్ అని సీఎం హామీ ఇచ్చారు.

ఆద్యంతం ఆహ్లాదం.. నవ్వులు
చిన్న నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో సీఎం నిర్వహించిన సమావేశం ఆద్యంతం ఆహ్లాదంగా.. నవ్వులతో సాగిపోయింది. సీఎం మాట్లాడుతున్నంత సేపు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఇంజినీర్లు శ్రద్ధగా విన్నారు. సీఎం ప్రసంగానికి అడుగడుగునా చప్పట్లతో తమ హర్షాతిరేకాలు తెలియజేశారు. సీఎం ప్రసంగం విన్న తర్వాత తమకు నూతన ఉత్తేజం వచ్చినైట్లెందని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇంజినీర్ ఒకరు భోజన విరామ సమయంలో తమ స్నేహితులతో ముచ్చటించుకుంటున్నారు. దాదాపుగా అందరు ఇంజినీర్లలో కూడా ఇదే భావన వ్యక్తమైంది. గత పదేండ్లుగా నిర్వీర్యమైపోయిన చిన్ననీటిపారుదల శాఖపై ఇంత శ్రద్ధ కనపర్చిన ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరని పలువురు ఇంజినీర్లు బాహాటంగా అభిప్రాయపడ్డారు.

కడుపు నిండా తినాలే..
సమావేశానికి పిలిచి అన్నీ చెప్పి పంపితే ఉపయోగం ఉండదు. కడుపునిండా తినాలే.. మంచిగా పని చేయాలే. యుద్ధానికి పోవాలంటే కత్తి, డాలు అన్ని కావలె. లేకుంటే ఎదురోడు మనల్ని పండబెడతడు అని సీఎం వ్యాఖ్యానించడంతో పెద్దఎత్తున చప్పట్లతో హాలు మారుమోగింది. ఫీల్డ్‌లో తిరిగే వారికి పెట్రోల్ అలవెన్స్ కూడా ఇస్తమని ప్రకటించడంతో మరోసారి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు.

రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు ఇవీ సీఎం నిర్ణయాలు
1. మండల ఇంజినీర్లకు లాప్‌టాప్‌లు ఇవ్వడం.
2. క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని విస్తరింపచేయడం.
3. చెరువు శిఖం భూములపై సర్వే, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశాలు.
4. పునరుద్ధరణ పనుల్లో సమస్యల పరిష్కారానికి ఇరిగేషన్ మంత్రి దగ్గర 7680072440 నంబర్‌తో హెల్ప్‌లైన్.
5. చెరువుల ఎఫ్‌టీఎల్, కట్టుకాలువల వివరాలు సరిగ్గా నిర్వహించడం.
6.చిన్ననీటి వనరుల విభాగానికి ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక గది.
7.ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాన్ని చెరువుల పునరుద్దరణకు ఉపయోగించడం.
8. జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణ.
9. పరిపాలన, ఆర్థిక అనుమతులు ఇచ్చే విషయంలో వివిధ స్థాయి అధికారులకు అధికారాలు.
10. ఏపీకి అలాట్ అయిన తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు రప్పించడం.
11. గోదావరి రివర్‌వ్యాలీ అథారిటీ, కృష్ణా రివర్ అథారిటీల ఏర్పాటు అవకాశాల పరిశీలన.
12. తెలంగాణ మైనర్ ఇరిగేషన్ యాక్టులో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు.
13. న్యూ తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ ప్రవేశపెట్టడం.
14. గ్రామాల్లో చెరువుల భూములను కాపాడే బాధ్యత వీఆర్‌వోలకు.
15. ప్రజాప్రతినిధుల సమన్వయంతో చెరువు పనుల ప్రతిపాదనలు.
16.చెక్‌డ్యాముల్లో పూడిక తీయడం.
17. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో శంకర్‌ప్రసాద్ నేతృత్వంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు.

జేసీబీలన్నీ తెలంగాణలో ఉండాలె
అన్ని మండలాల్లో సమాంతరంగా పని జరగాలని, ఎక్కడా ఫిర్యాదులు రాకూడదని కేసీఆర్ సూచించారు. నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కొత్త ఎమ్మెల్యేలు ఉన్నరు కాబట్టి, వాళ్లకు తెలియకపోతే, సీనియర్లు అయిన ఇంజినీర్లు గైడ్ చేయాలని చెప్పారు. ఎండకాలం వచ్చిందంటే దక్షిణ భారతదేశంలోని జేసీబీలన్నీ తెలంగాణలో కనపడాలని, ఆ విధంగా ప్రతి సంవత్సరం చెరువుల పునరుద్ధరణ పనులు జరగాలని చెప్పారు. ప్రతి మనిషికి కల్పన ఉండాలని, ఉంటేనే అది సాధ్యమవుతుందని, తాను తెలంగాణ కోసం కల్పన కన్నానని, అది సాకరమైందని చెప్పారు. చెరువులు నిండి 24 గంటలు కరెంట్ ఇస్తే, తెలంగాణ రైతులు బంగారం పండిస్తరని సీఎం చెప్పారు. తెలంగాణలో కరువుభూతాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *