mt_logo

చేరదీసిందెవరు? చెయ్యిచ్చిందెవరు?

ఉరకలెత్తించిన తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది కార్యకర్తలు, ఎన్నో కష్టనష్టాలకోర్చి ఎత్తిన జెండా దించకుండా కదం కదం కలిపి ముందుకు సాగారు. లాఠీ దెబ్బలకు, రబ్బరు బుల్లెట్లకు, బాష్పావాయు గోళాలకు ఎదురొడ్డి నిలబడ్డారు. లక్ష్య సాధనలో అలుపెరగకుండా శ్రమించిన తెలంగాణ పోరాటం గమ్యాన్ని ముద్దాడింది. అయితే, అలుపెరుగని ఈ సుదీర్ఘమైన పోరాటంలో విద్యార్థులు, విద్యార్థి నాయకుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఈ విద్యార్థులు వివిధ పార్టీల అధ్వర్యంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. తెలంగాణ వచ్చిన తరువాత, అ విద్యార్థి నాయకుల పట్ల ఆయా పార్టీలు ఎలాంటి వైఖరి కనబర్చాయో… విద్యార్థి ఉద్యమ నాయకుల్ని అక్కున చేర్చుకున్నదెవరో, అవసరానికి ఉపయోగించుకొని ఆక్ పాక్ కరివేపాక్ లా తీసిపారేసిందెవరో చూద్దాం.

అసాధ్యమని అందరూ భావించిన తెలంగాణను సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితిపై (టీఆరెఎస్) అపారమైన నమ్మకం ఉంచి 2014 ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించారు. ఆ ఎన్నికల్లో కాకలు తీరిన రాజకీయ నాయకులెందరో టీఆరెఎస్ ఎంపి, ఎమ్మెల్యే సీట్లను ఆశించారు. అయితే, కేవలం అంగ బలమో, అర్థ బలమో మాత్రమే చూడకుండా… తెలంగాణ, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థి నాయకులకు కొంతమందికైనా అవకాశం ఇవ్వాలని టీఆరెఎస్ పార్టీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఉస్మానియా విద్యార్థి నాయకులు బాల్క సుమన్ ని పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిగా, గ్యాదరి కిషోర్ ని తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా, పిడమర్తి రవిని సత్తుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీఆరెఎస్ పార్టీ నిలబెట్టింది. పిడమర్తి ఓటమి పాలయినా, బాల్క సుమన్, గ్యాదరి కిషోర్ లు ఘనవిజయం సాధించి చట్ట సభల్లోకి అడుగుపెట్టారు. మరి కొంత మంది విద్యార్థి నాయకులని టీఆరెఎస్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో నియమించి అక్కున చేర్చుకుంది. విద్యార్థి ఉద్యమ నాయకులు చిరుమ‌ల్ల రాకేష్ ని తెలంగాణ రాష్ట్ర టెక్న‌క‌ల్ స‌ర్వీసెస్ కార్పొరేష‌న్(TSTS) ఛైర్మ‌న్‌గా, కె. వాసుదేవ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర విక‌లాంగుల అభివృద్ధి సంస్థ ఛైర్మ‌న్‌గా, ఎర్రోల్ల శ్రీనివాస్ ని ఎస్సీ కమిషన్ చైర్మన్ గా, బీ. విద్యా సాగర్ ను ఎస్సీ కమిషన్ సభ్యులుగా, ఆంజనేయులు గౌడ్ ను బీసి కమిషన్ సభ్యులుగా నియమించారు. కొంతమంది విద్యార్థి నాయకుల సేవల్ని టీఆరెఎస్ పార్టీ లో ఉపయోగించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత వచ్చిన GHMC ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించి మరో విద్యార్థి ఉద్యమ నాయకుడైన బొంతు రామ్మోహన్ ని హైదరాబాద్ మేయర్ ని చేసింది.

ఇలా ఒకవైపు టీఆర్ఎస్ విద్యార్థి నాయకులకు తగిన గుర్తింపుని, సముచిత గౌరవాన్నిస్తూ చేరదీస్తుండగా,  మరో వైపు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి ఉద్యమ నాయకుల పట్ల చూపిస్తున్న వైఖరి చాలా దారుణంగా ఉంది. 2014 ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్క విద్యార్థి నాయకుడిని కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టలేదు. ఇంకా ఘోరం ఏంటంటే, OU ఉద్యమ నాయకుడు క్రిశాంక్ కు మొదట కాంగ్రెస్ MLA సీటు ఖరారు చేసి తీరా బీ-ఫారం ఇవ్వాల్సిన సమయానికి మొండి చేయి చూపించి అభ్యర్థిని మార్చేసారు.

ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో, 2014 ఎన్నికల్లో ఓయు విద్యార్థి నాయకులకి టికెట్లు ఆశ చూపి నిరాశ పరిచిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 2018 ఎన్నికల్లో అదే పునరావృతం చేయబోతుందనిపిస్తుంది. విద్యార్థుల్లో ప్రభుత్వ వ్యతిరేఖ భావనలను రేకెత్తింపచేయడానికి యూనివర్సిటి విద్యార్థి నాయకుల సేవలుపయోగించుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు సీట్లు ఇవ్వల్సివచ్చే సమయం వచ్చేసరికి వారి మొండి చెయ్యి చూపిస్తుంది. మెయిన్ స్ట్రీం మీడియాలో వస్తున్న వార్తలు ఈ విషయాన్నే ధృవీకరిస్తున్నాయి. మీ దగ్గర ఎన్ని పైసలున్నయ్?…ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఎంత ఖర్చు పెడ్తవ్? అంటూ టికెట్ ఆశిస్తున్న విద్యార్థి ఉద్యమ నాయకులను కాంగ్రెస్ నేతలు, మహాకూటమి నేతలు అవమానాల పాలు చేస్తున్నారని. విద్యార్థి JAC నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ లో ఉన్న రంగు బాల లక్ష్మి ఇలాంటి ప్రశ్నలను తట్టుకోలేక కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యింది అన్న వార్తలు కాంగ్రెస్ పార్టీ అసలు రూపాన్ని మరో మారు బయట పెడుతున్నాయి.

ఏ పార్టీ ఉద్యమ నాయకులను అక్కున చేర్చుకొంటుందో, ఏ పార్టీ ముందు స్నేహ హస్తం చాచి ఆ తరువాత మొండి చెయ్యి చూపిస్తుందో అందరికీ అర్థం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *