– కొణతం దిలీప్
నేను చరిత్రకారుడిని కాదు. మీలాగే తెలంగాణ అంటే ప్రాణాలకన్న మిన్నగా ప్రేమించేవాడిని. ఉద్యమంలో భాగంగా అనేక చర్చల్లో పాల్గొంటున్నపుడు తెలంగాణ చరిత్ర పట్ల మనల్ని వ్యతిరేకించేవారికే కాక మనకు కూడా చాలా మౌలికమైన విషయాలు తెలియవని అర్థమైంది. దీనికి ప్రధాన కారణం సీమాంధ్ర ప్రాంతపు వలసాధిపత్యం కింద తెలంగాణ చరిత్ర పూర్తిగా వక్రీకరణకు గురికావడం. మన ఉద్యమంలో ప్రజాబాహుళ్యంలోకి రాకుండా ఉండిపోయిన ఒక ప్రధాన ఘట్టాన్ని పరిచయం చేయడమే ఈ వ్యాసం ఉద్దేశం.
భూమికోసం, భుక్తి కోసం, బానిసత్వం నుండి విముక్తి కోసం ఆనాడు తెలంగాణ ప్రజలు జరిపిన సాయుధ పోరు ప్రపంచ చరిత్రలో శిలాక్షరాలతో లిఖించదగ్గది. కానీ ఇప్పటికీ మన పాఠ్యపుస్తకాల్లో ఆ ఘనచరిత్ర అక్షరం కూడా కనిపించదు.
చాలా ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలు నడిపిన నేతలే ఉద్యమాలను రికార్డు చేయడం రివాజు. వారి అనుభవాలే చాలాసార్లు ప్రామాణిక చరిత్రగా మిగిలిపోతుంది. కానీ తెలంగాణ రైతాంగ సాయుధ ప్రాంతం ముందుండి నడిపిన భారత కమ్యూనిస్టు పార్టీ నేతలు ఎవరూ తాము సాగించిన ఉద్యమాన్ని కానీ, తెలంగాణ ప్రాంతం గురించి కానీ వెంటనే రికార్డు చేయలేదు. నిజాం మీద వ్యతిరేకతతో “తెలంగాణలో ఏమీ లేదు చీకటి తప్ప” అనే ఒక అభిప్రాయానికి అప్పటి కమ్యూనిస్టు నాయకులు వచ్చినట్టు మనకు అనిపిస్తుంది.
సాయుధ పోరాటం ముగిసి రెండు దశాబ్దాలయిన తరువాత మేల్కొన్న కమ్యూనిస్టు నాయకులు తమ తమ జీవితానుభవాలను (పుచ్చలపల్లి సుందరయ్య – వీర తెలంగాణ విప్లవపోరాటం; రావి నారాయణ రెడ్డి – తెలంగాణ సాయుధ పోరాటం) రాసి ప్రచురించారు కానీ అప్పటికే చాలా సమయం గడచిపోవడం వల్ల ఈ పుస్తకాలు అసంపూర్ణంగా కనిపిస్తాయి.
తెలంగాణ ప్రాంతంలో ఉన్న నైసర్గిక పరిస్థితులు, ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక నేపధ్యం, ఇక్కడ జరిగిన సాయుధ పోరాటం, ఇక్కడి రాజుపై భారత ప్రభుత్వం చేసిన సైనిక దాడి, అప్పట్లోనే ఒక ప్రపంచ శ్రేణి నగరంగా అభివృద్ధి అయిన హైదరాబాదు, ఎన్నికలు లేకుండా ఒక ప్రభుత్వ అధికారిని ముఖ్యమంత్రిగా నియమించడం, తొలినాళ్లలో హైదరాబాదు రాష్ట్రంలో జరిగిన పరిపాలన వంటి అంశాలపై అతి కొద్ది సమాచారం మాత్రమే లభ్యమవుతోంది. అది కూడా ఇటీవలి కాలంలో తెలంగాణ ఉద్యమకారులు చేసిన పరిశోధనలవల్ల వెలికి వచ్చిన చరిత్రనే.
ఇక స్వపరిపాలనే లక్ష్యంగా అత్యంత ప్రజాస్వామ్యయుతంగా తమ ఆకాంక్షను వెల్లడించి, రాష్ట్ర పునర్విభజన కమీషన్ వద్ద తమ వాదనలు వినిపించి సదరు కమీషన్ తెలంగాణ రాష్ట్రాన్ని సిఫారసు చేసేలా చేసిన మన పూర్వీకుల మహత్తర చరిత్ర గురించి ఈ తరంలో అత్యధికులకు తెలవకపోవడానికి కారణం నిస్సందేహంగా వలస పాలకుల వివక్షనే.
తెలంగాణ ఉద్యమ చరిత్ర అనగానే చాలామంది 1969 నుండి మొదలు పెడతారు. ఈనాటికి కూడా 1969 ఉద్యమమే మొదటి తెలంగాణా ఉద్యమంగానే చలామణి అవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పాటుకు పూర్వమే, 1950ల్లో చాలా బలంగా వ్యక్తీకరించిన తెలంగాణ రాష్ట్రకాంక్ష, నడిచిన ప్రజా ఉద్యమం చరిత్ర పుస్తకాలకెక్క లేదు.
నిజాముకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలోనే వ్యక్తమైన స్వపరిపాలన ఆకాంక్ష, సైనిక చర్య తదనంతరం కూడా అంతర్లీనంగా కొనసాగింది.
1951 ఆగస్టులో అప్పటి ప్రసిద్ధ మాసపత్రిక “సుజాత” ఒక ప్రత్యేకమైన “తెలంగాన సంచిక” ను వెలువరించింది. ఈ ప్రాంత చరిత్ర, రాజకీయోద్యమాలు, వనరులు, శిల్పకళ, పత్రికలు, సాహిత్యం వంటి అంశాలు ఆ పత్రికలో పొందుపరిచారు.
1952 డిసెంబరులో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రాగానే దేశంలో అనేక ప్రాంతాలు తమకు కూడా రాష్ట్ర రూపంలో స్వంత అస్థిత్వం ఉండాలని కోరుకోవడం మొదలైంది.
దేశంలోని విభిన్న ప్రాంతాల ప్రజల నుండి వస్తున్న ఈ డిమాండ్లను పరిష్కరించడానికి, పరిపాలనా సౌలభ్యం కొరకు దేశాన్ని కొత్త రాష్ట్రాలుగా విభజించాలని, ఆ పనిచేయడానికి ఒక కమీషను నియమించాలని నెహ్రూ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చింది.
ఈక్రమంలోనే పునర్విభజనలో భాగంగా హైదరాబాదు రాష్ట్రాన్ని భాషా ప్రాతిపదికన మూడు భాగాలుగా చేస్తారనే ఆలోచన ముందుకు వచ్చింది.
1950ల నాటి గోలుకొండ పత్రిక నుండి కొన్ని అరుదైన క్లిప్పింగులు
—
—
—
—
—
—
—
—
—.
హైదరాబాదు రాష్ట్రంలోభాగంగా ఉన్న కన్నడ జిల్లాలు, మరాఠీ జిల్లాలు తమ తమ మాతృ రాష్ట్రాల్లో విలీనమవడానికి సుముఖంగానే ఉండగా, తెలుగు జిల్లాలయిన తెలంగాణ ప్రజలు మాత్రం తాము ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని కోరుకున్నారు.
ఒకే భాషా సంస్కృతులు, పటిష్టమైన ఆర్ధిక రంగం, అనువైన భౌగోళిక పరిస్థితులు, ప్రపంచ శ్రేణి రాజధాని నగరంతో సహా అనేక హంగులు ఉన్న తెలంగాణ ప్రాంతం ఒక రాష్ట్రం కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయని అనుకున్నది.
దీనికి తోడు తోటి తెలుగువారయిన ఆంధ్రులతో వారికి అప్పటికే చేదు అనుభవాలు ఉండటం తెలంగాణ ప్రజల్లో ఈ ఆలోచనకు ఊతం ఇచ్చింది.
1953 అక్టోబర్ నెలలో ప్రజా సోషలిస్ట్ పార్టీ నాయకుడు రామమూర్తి నాయుడు తొలిసారిగా “స్వతంత్ర తెలంగాణ” అనే నినాదం వినిపించాడు. కొద్ది రోజుల తరువాత, అదే పార్టీకి చెందిన మహదేవ్ సింగ్ అనే నాయకుడు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండును బలపరిచాడు.
1953 డిసెంబరులో నెహ్రూ రాష్ట్రాల పునర్విభజన కమీషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు.
1954 జనవరిలో హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన కె.వి రంగా రెడ్డి కూడా విశాలాంధ్రను వ్యతిరేకిస్తూ ఒక ప్రకటన ఇచ్చాడు. ఏప్రిల్ నెల నాటికి అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణా రావుతో సహా పలువురు హైదరాబాద్ రాష్ట్ర మంత్రులు విశాలాంధ్రను వ్యతిరేకించడం మొదలుపెట్టారు.
ఆ సమయంలో ఎన్. నరోత్తం రెడ్డి సంపాదకత్వంలో ప్రచురితమయిన గోల్కొండ పత్రిక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను వెల్లడించడంలో ప్రధాన పాత్ర పోషించింది.
సంక్రాంతి పండుగ రోజును “విశాలాంధ్ర వ్యతిరేక దినం” గా జరపాలని జనవరి 1, 1954 నాడు కేంద్ర హోమియోపతిక్ లీగ్ సభ్యుడు డాక్టర్ డి హనుమంతరావు పిలుపునిచ్చాడు.
1954 ఏప్రిల్ లో హైదరాబాదును సందర్శించిన ఫజల్ అలీ కమీషన్ కు పలు తెలంగాణ సంఘాలు, నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయవలసిందిగా మెమోరాండాలు సమర్పించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అన్నివిధాల సౌకర్యంగాను, స్వయంపోషకంగాను ఉంతుందని, దీని అధికసంఖ్యాక ప్రజలు అనుకూలంగా ఉన్నారని సికింద్రాబాద్ మునిసిపల్ కౌన్సిలర్లు ఒక మెమొరాండంలో పేర్కొన్నారు.
జూన్ 1 నాడు ఫజల్ అలీ కమీషన్ సభ్యులను కలిసిన హైదరాబాదు ప్రజాపరిషత్తు అధ్యక్షుడు ఏ. సత్యనారయణ రెడ్డి విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడరాదని. ఒకవేళ హైదరాబాదు రాష్ట్రాన్ని విభజించినట్టయితే హైదరాబాదు నగరం రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ, తెలంగాణ ఖనిజ సంపద, నదీ ప్రాజెక్టులు పూర్తి అయిన తరువాత దాని వ్యవసాయ సంపదను వివరించి తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల స్వయం పోషకం కాగలదని ఒక మెమొరాండంలో పేర్కొన్నాడు.
జూన్ 7 నాడు పి.సి.సి తెలంగాణ ప్రరినిధుల సమావేశంలో విశాలాంధ్ర తీర్మానానికి అనుకూలంగా 13 ఓట్లు వస్తే ప్రతికూలంగా 31 ఓట్లు రావడంలో ఆ తీర్మానం ఓటమి పాలయ్యింది.
ఈ పరిణామంపై వ్యాఖ్యానిస్తూ జూన్ 20 నాడు కొండా వెంకట రంగారెడ్డి “రెండు రాష్ట్రాల వల్లనే ఆంధ్ర తెలంగాణా సంబంధాలు బాగుపడి సన్నిహితత్వం సుహృద్భావం ఇనుమడించగలదు” అని ప్రకటించాడు.
వరంగల్ మునిసిపల్ కార్మికుల సంఘం, హైదరాబాదు స్టేటు మజ్దూర్ సంఘం, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, తో సహా అనేక సంస్థలు ఎస్సార్సీ సభ్యులను కలిసి తెలంగాణ ఏర్పాటు చేయాలెనని విజ్ఞప్తులు సమర్పించారు.
తెలంగాణ ప్రాంతంలో అక్కడక్కడా విశాలాంధ్ర నినాదం వినిపిస్తున్నవారు నిజానికి గైర్ ముల్కీలు (స్థానికేతరులు) అని గోల్కొండ పత్రిక 22 జూన్ నాడు ఒక కథనం ప్రచురించింది.
జూన్ 29 నాడు హైదరాబాదులో ఫజల్ అలీ కమీషన్ సభ్యులను కాంగ్రెస్ ప్రతినిధి వర్గం కలిసింది. ఇందులో హరిశ్చంద్ర హెడా, జె.వి నరసింగ రావు, జనార్ధన రెడ్డి, అరిగె రామస్వామి, జె. రామిరెడ్డి కలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
1955 ఆగస్టులో తొలిసారిగా ఫజల్ అలీ కమీషన్ హైదరాబాదు నగరం రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని సిఫారసు చేయనుందనే వార్తలు పత్రికల్లో రాసాగాయి. తెలంగాణ ప్రాంత ప్రజల్లో, నాయకుల్లో హర్షాతిరేకాలు వెల్లడి కాగా ఆంధ్ర నాయకులు మాత్రం హుటాహుటిన డిల్లీలో విశాలాంధ్ర కొరకు లాబీయింగ్ మొదలు పెట్టారు.
1955 సెప్టెంబర్ 30 నాడు ఫజల్ అలీ కమీషన్ రిపోర్టు వెలువడింది. ఊహించినట్టుగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్ధిస్తూ కమీషన్ నివేదిక ఇచ్చింది.
అది మొదలు దాదాపు ఆరు నెలల పాటు ప్రజలు సదస్సులు, ర్యాలీలు, సమావేశాలతో తెలంగాణ దద్దరిల్లింది.
నాగార్జున సాగర్ శంకుస్తాపనకు వచ్చిన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు హైదరాబాదు వీధుల్లో వందలాది మంది ప్రజలు రోడ్డుకిరువైపులా నిలబడి తెలంగాణ నినాదాల ప్లకార్డులతో స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో అంటీముట్టనట్టుగా ఉన్నందుకు ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణా రావుకు ఉద్యమకారులు నిరసన తెలిపారు. విశాలాంధ్ర కొరకు లాబీయింగ్ చేస్తున్న ఆంధ్ర మంత్రి తెన్నేటి విశ్వనాధానికి బేగంపేట విమానాశ్రయంలోనే చుక్కలు చూపించారు తెలంగాణా ఉద్యమకారులు.
గల్లీలో తెలంగాణ నినాదం హోరెత్తుతున్న సమయాన ఇప్పటిలాగానే ఆంధ్ర రాజకీయ బేహారులు మాత్రం డిల్లీలో లాబీయింగుకు తెరతీశారు. ఏం తాయిలాలు చూపారో తెలవదు కానీ కాంగ్రెస్ అధినాయకత్వాన్ని లోబరుచుకుని తెలంగాణను బలవంతంగా విలీనం చేసుకున్నారు. పుట్టకముందే తెలంగాణ స్వప్నాన్ని చిదిమేశారు.
అప్పటి తెలంగాణవాదుల కృషి తెలుసుకోవాలంటే మనం మహబూబ్ నగర్ కు చెందిన బి.ఎన్ శాస్త్రి గారు రాసిన “తెలుగు వారికి రెండు రాజ్యాలెందుకు” అనే వ్యాసం, అట్లాగే నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు హరిశ్చంద్ర హెడా గారు గోల్కొండ పత్రికలో రాసిన వ్యాసాల సంకలనం తప్పక చదవాలి. ఇవ్వాళ ఏయే ప్రశ్నలకయితే మనం బదులివ్వడానికి ప్రయత్నిస్తున్నామో, ఆరు దశాబ్దాల క్రితమే మన ముందు తరం తెలంగాణ ఉద్యమకారులు ఆయా ప్రశ్నలకు జవాబులిచ్చారు.
తెలంగాణ అనేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి ముందే ఉన్న ప్రజాస్వామిక ఆకాంక్ష అని, దాన్ని నెరవేర్చుకోవడానికి మన పెద్దలు అత్యంత న్యాయమైన, ప్రజాస్వామ్యమైన, రాజ్యాంగబద్ధమైన మార్గాన్ని అనుసరించి విజయాన్ని కూడా సాధించారని 1950ల తెలంగాణ ఉద్యమ చరిత్ర చదివితే అర్థమవుతుంది. వివక్ష, ఒప్పందాల ఉల్లంఘనల వల్ల మన రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉధృతమయ్యింది తప్ప వాటికవే మన ఆకాంక్షకు ప్రాతిపదికలు కావని కూడా మనకీ చరిత్ర తెలుసుకుంటే విశదమవుతుంది.
[రెండేళ్ల క్రితం రాసిన ఈ వ్యాసం ప్రవాస తెలంగాణ మిత్రులు ప్రచురిస్తున్న “సింగిడి” పత్రికలో ప్రచురితమయ్యింది. 1950 ల నాటి ఉద్యమాన్ని సమూలంగా డాక్యుమెంట్ చేయడానికి ఇది తొలి డ్రాఫ్ట్ గా ఉపయోగపడుతుందని నా నమ్మకం. ]