హైదరాబాద్ అద్భుతమైన నిర్మాణ నైపుణ్యంతో కట్టిన నగరమని, చారిత్రక ఆనవాళ్ళు చెరిగిపోకుండా అంతర్జాతీయ స్థాయిలో యునిక్ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ బృందంతో సీఎం కేసీఆర్ సమావేశమై హైదరాబాద్ లో చేపట్టాల్సిన పలు నిర్మాణాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ అద్భుత నగరమని, చార్మినార్, గోల్కొండ, చౌమహల్లా, మక్కా మసీద్, ఫలక్ నుమా, సాలార్జంగ్ మ్యూజియం, అసెంబ్లీ, హైకోర్టు లాంటి భవనాలు నగరానికి ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టాయని అన్నారు. చారిత్రక ఆనవాళ్ళకు ఆటంకం కలగకుండా ఇస్తాంబుల్ నగరం స్ఫూర్తిగా హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సీఎం పేర్కొన్నారు.
ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తెలంగాణ కళా భారతి పేరుతో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని హఫీజ్ బృందానికి సీఎం సూచించారు. ఇందుకు సంబంధించిన డిజైన్ తయారు చేయాలని, నాలుగు ఆడిటోరియంలు, విశాలమైన పార్కింగ్ ఏరియా ఉండేలా నమూనా తయారు చేయాలని కోరారు. ప్రస్తుతం రవీంద్రభారతి ఉన్న ప్రాంతంలో హైదరాబాద్ చరిత్ర, సంస్కృతి ఉట్టిపడేలా ఒక ప్రత్యేక కట్టడం కట్టాలని, చార్మినార్, మొజాంజాహీ మార్కెట్, హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతం, సాలార్జంగ్ మ్యూజియం ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న నిర్మాణాలకు మరింత అద్భుతంగా ఉండేలా ఆవరణలు ఉండాలని చెప్పారు.
నిజాం రాజులు అద్భుతమైన కట్టడాలను అందిస్తే వాటికి అనుబంధంగా మరిన్ని కట్టడాలను తేవాల్సిందేనని, గత వైభవం పునరుద్ధరించేలా కొత్త నిర్మాణాలు రావాలని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. చార్మినార్ వంటి కట్టడాలను మరిపించి హైటెక్ సిటీ పేరుతో నిర్మించిన ఒక సాధారణ సిమెంట్ కట్టడాన్ని హైదరాబాద్ సింబల్ గా గత పాలకులు చూపించే ప్రయత్నం చేశారని, గతంలో జరిగిన పొరపాట్లను చక్కదిద్దే బాధ్యత తమపై ఉందని, ఇందుకోసం ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి రాజయ్య, నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.