mt_logo

సాగు రంగంలో సమూల మార్పులు

By డాక్టర్ పిడిగెం సైదయ్య
(వ్యాసకర్త: శాస్త్రవేత్త, రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం)

కేసీఆర్ తన విధానాలను రైతులను ఆదుకోవడానికి మాత్రమే పరిమితం చేయలేదు. వ్యవసాయ రంగంలో శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహించడానికి, యాంత్రీకరణ, సమిష్టి సాగు విధానాలను ప్రవేశపెట్టడానికి ముఖ్యమంత్రి ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు వ్యవసాయరంగంలో వేసిన పునాదులను మాత్రమే మనం చూస్తున్నాం. రాబోయే కాలంలో ఆయన తలపెట్టిన మార్పులు మరింత ఆశ్చర్యకరంగా ఉంటాయి.

దేశ అభివృద్ధికి వ్యవసాయం ఎంతో కీలకమైంది. ఇది తెలంగాణ రాష్ట్రానికీ వర్తిస్తుంది. ఆరు దశాబ్దాలకు పైగా సీమాంధ్ర పాలనలో నిర్లక్ష్యానికి గురైన నేపథ్యంలో వ్యవసాయరంగ అభివృద్ధిపై ప్రత్యే క దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఏర్పడ్డది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగ ప్రాధాన్యాన్ని గుర్తించడమే కాదు. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి శాస్త్రీయమైన పరిష్కారాలను ఎంతో విశ్లేషించి కనుక్కున్నారు. ఈ పరిష్కారాల సాధనకు తగిన వ్యూహాన్ని రూపొందించి అమలు చేశారు. ఈ నాలుగేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పథకాల న్నీ ఈ సమగ్ర వ్యవసాయ విధానంలో భాగమే. ఈ సమగ్ర వ్యవసాయ విధానం మూలంగా రాష్ట్రంలోని 58లక్షల రైతు కుటుంబాలు మాత్రమే కాదు, మొత్తం సమాజమే వృద్ధి చెందుతుంది. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యం వల్ల మొత్తం గ్రామాల ఆర్థిక స్థితిగతులే మారిపోతు న్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్నప్పుడు తెలంగాణలో వ్యవసాయ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. మెట్ట సాగును మరింత భ్రష్టు పట్టించారు. తెలంగాణ రైతాంగం బోరుబావుల వ్యవసాయంతో అప్పుల బారిన పడింది. పరిశోధనలకు నిధులు కేటాయించలేదు. సాగు నీటి ఆధారం లేకపోవడంతో పంటల దిగుబడులు క్షిణించాయి. చిన్న, సన్నకారు రైతులు మూడొంతులు పైగా ఉన్నారు. వరుసగా కరువు, కాటకాలు రావడం వల్ల ఈ బడుగు రైతులు తమ స్థోమతను మించి పెట్టిన పెట్టుబడులు కూడా రాబట్టుకోలేకపోయారు. కనీసం తీసుకున్న పంట రుణాలు కూడా తీర్చలేని పరిస్థితి.

శాస్త్రీయత లేకపోవడం, ప్రైవేటు విత్తన సంస్థల ప్రచార ఆర్భాటాలతో బీటీ పత్తి హైబ్రిడ్లు, హైబ్రిడ్ మిరప రకాలు బలవంతంగా తెలంగాణ రైతుల నెత్తిన రుద్దబడినాయి. సాగులో సమస్య వస్తే తమదైన మేధో సంపత్తితో వెన్నుదన్నుగా నిలిచే వ్యవసాయ విస్తరణ వ్యవస్థ కుంటుపడింది. రైతులకు సంస్థాగత రుణాలు, తక్కువ వడ్డీకి రుణాల లభ్యత మృగ్యమయింది. ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు పెరిగాయి. అయితే అందుకు అనుగుణంగా మద్దతు ధరలు పెరుగలేదు.

ఇక వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వ్యవస్థ నిద్రాణమై ఉన్న రోజులవి. ఈ విధంగా వ్యవసాయ రంగాన్ని అనేక రుగ్మతలు వేధించాయి. ఇవన్నీ నాటి పాలకుల నిర్లక్ష్యం వల్ల ఏర్పడినవే.

తెలంగాణ ఏర్పడిన వెంటనే వ్యవసాయరంగానికి జవజీవాలు అందించడంపై అంతర్మథనం మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ కాలం నుంచే తెలంగాణలోని అన్నిరంగాలను, వాటి అభివృద్ధి వ్యూహాలను అధ్యయనం చేస్తున్నారనేది వాస్తవం. అందుకనే వ్యవసాయ రంగంలో క్షేత్రస్థాయి వాస్తవాలను త్వరగా గ్రహించగలిగారు. గ్రామీణ జీవనోపాధి ప్రాధాన్యాన్ని గుర్తించారు. తెలంగాణలో ప్రధాన నీటి వనరులైన చెరువుల పునరుద్ధరణపై కూడాదృష్టి సారించారు. చిన్న నీటి వనరుల పునరుద్ధరణతో మెట్ట సాగు వ్యవసాయం బాగుపడుతుందని ఆయన భావిం చారు. ఫలితంగా 46 వేలకు పైగా చెరువులను పునరుద్ధరిస్తూ అదనపు ఆయకట్టుకు సాగునీటిని అందించే ఏర్పాట్లు చేశారు. రుణమాఫీతో 35 లక్షల మంది రైతులను రుణభారం ఊబిలోంచి బైటపడేసారు.

కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకమైతే జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాలలోని ఆర్థికవేత్తలను ఆశ్చర్యపరిచింది. వానకాలం, యాసంగి పంటలకు కలిపి ఎకరానికి 8,000 రూపాయల వ్యవసాయ పెట్టుబడిని రైతులకు అందచేయడం అపూర్వమైన పథకం. దీంతో గ్రామాలలో ఈ వానకాలం సాగు సంబురంగా మొదలైంది. ప్రభుత్వం పారదర్శకంగా నేరుగా రైతులకే నేరుగా పెట్టుబడి సొమ్మును అందించింది. దీంతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయానికి మంచిరోజులు మొదలయ్యాయి. ప్రభుత్వమే పెద్దన్నగా పెట్టుబడి ఇచ్చింది. మళ్ళా టీఆర్‌ఎస్ పార్టీయే గెలిస్తే భవిష్యత్తులో కొనసాగిస్తుంది అనే నమ్మకం రైతుల మెదళ్లలో ఉన్నది. దీనికితోడు రైతుబంధు పథకం అందుకున్న వారందరికి ఐదు లక్షల రూపాయల రైతు బీమా వర్తించే విధంగా ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకున్నది. రైతుల తరఫున ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించింది. దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు మరణిస్తే పదిరోజుల్లోనే బీమాక్లైమ్‌ల చెల్లింపు జరిపేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. దీంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవసాయ అజెండా కలిగి ఉన్నదని చాటుకున్నది. రైతులకు వ్యవసాయంపైనే కాదు, కుటుంబ మనుగడపై కూడా భరోసా కలిగింది. కేసీఆర్‌ను ఇంటికి పెద్ద కొడుకుగా చెప్పుకోవడానికి సంక్షేమ పథకాలతో పాటు ఈ వ్యవసాయ విధానంలో రైతులకు భరోసా కలిగిస్తున్న తీరును ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం వరుసగా నాలుగు బడ్జెట్లలో సాగు నీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది. అందుకు అనుగుణంగా కేటాయింపులు చేసింది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తూనే, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఆ ఫలితాలను రైతులు చవిచూస్తున్నారు. భూములు బీడుపడి జనం వలస పోయిన పాలమూరు వంటి జిల్లాల్లో కూడా పచ్చని పొలాలు కన్నుల పండుగ చేస్తున్నాయి. సాగు బాగుండాలంటే మద్దతు ధరలు బాగుండాలె. అందుకే రైతుల శక్తిని సంఘటితం చేసే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసింది. వ్యవసాయ రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు. ఈ రైతు సమితుల కార్యకలాపాల కోసం రూ. 500 కోట్లు కేటాయించింది. ఇది పలు ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నది. టమాటా, ఉల్లి ధరలు ఉత్పత్తి ఖర్చుల కంటే తగ్గిపోయినప్పుడు మార్కెట్ జోక్యపు నిధి ఉపయోగించి రైతులను ఆదుకున్నది. ఇ-నామ్ కూడా పకడ్బందీగా అమలవుతున్నది. మార్కెట్ నియమాల సరళీకరణ ఫీజుల ఏకీకృతం, దళారుల ప్రమేయం రూపుమాపటంతో రైతులు నేరుగా ఉత్పత్తులను విక్రయించే సౌలభ్యం కల్గించింది.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేండ్లలోనే వ్యవసాయాభివృద్ధికి అనేక చర్యలను తీసుకున్నది. రైతులకు పంటలు పండించే ప్రతి దశలో సూచలు ఇవ్వడానికి 3500 మందికి పైగా వ్యవసాయ విస్తరణ నిపుణులను నియమించింది. రైతు సమన్వయ వేదికలు ఏఈవో క్లస్టర్ పరిధిలో ఏర్పాటయ్యాయి. వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల పరిధిలో నూతన కళాశాలలు, పరిశోధన సంస్థలను ఏర్పాటు చేసింది. వీటిలో అధ్యాపకుల భర్తీతో పరిశోధన, విద్యలకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది.

స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం పెట్టుబడి ఖర్చులు పోను 50 శాతం లాభం ఉండేలా మద్దతు ధరలను లెక్కిస్తూ కేంద్రానికి పంపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. నాలుగు రాష్ట్రాలకు నోడల్ ఏజెన్సీగా తెలంగాణ విత్తన సేంద్రియ ధృవీకరణ అథారిటీని ఏర్పాటు చేసింది. ఏ రాష్ట్రం చేయ ని విధంగా దాదాపు 34 వేల క్వింటాళ్లు ధృవీకరణ విత్తనాలను విదేశాలకు ఎగుమతి చేయగలిగాం. కల్తీ విత్తనాల విక్రయదారులపై పీడీ చట్టం పెట్టి ఉక్కుపాదం మోపింది. ఉద్యాన కార్పొరేషన్‌ను, ప్రాసెసింగ్ యూని ట్లను ఏర్పాటు చేసింది. విత్తన గ్రామాలను నెలకొల్పి తెలంగాణను విత్తన భాండాగారంగా మరింత అభివృద్ధి చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సఫలమైంది. ముఖ్యమంత్రి తనే రైతుగా, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం వెంటనే చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ పథకాల రూపకల్పన జరిగింది. వాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ ప్రభుత్వం రైతుల బతులకు భరోసా ఇచ్చింది అనే అభిప్రాయం ఉన్నది.

హరితగృహాలలో సాగును ప్రోత్సహించడానికి ఎకరానికి సరాసరిన 30 లక్షల వరకు సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. దీంతో రాష్ట్రంలో కూరగాయల కొరత కూడా తగ్గింది. సుమారు వెయ్యి కోట్లతో అత్యంత సాగునీటి పొదుపు సామర్థ్యం కలిగిన బిందు, తుంపర సేద్యాలను రైతులకు అందించింది. శాస్త్రీయత, పెట్టుబడి ఖర్చులు తగ్గించే పంట కాలనీల ఆలోచన అమలుకు పూర్తిస్థాయి కార్యాచరణ మొదలైంది. మండలాలకు ట్రాక్టర్లు, వరినాటు యంత్రాలు, ఇతర పనిముట్లు అందజేసి వ్యవసాయ యాంత్రీకరణకు ఊపునిచ్చింది.

కేసీఆర్ తన విధానాలను రైతులను ఆదుకోవడానికి మాత్రమే పరిమితం చేయలేదు. వ్యవసాయ రంగంలో శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహించడానికి, యాంత్రీకరణ, సమిష్టి సాగు విధానాలను ప్రవేశపెట్టడానికి ముఖ్యమంత్రి ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ముఖ్య మంత్రి ఇప్పటి వరకు వ్యవసాయ రంగంలో వేసిన పునాదులను మాత్రమే మనం చూస్తున్నాం. రాబోయే కాలంలో ఆయన తలపెట్టిన మార్పులు మరింత ఆశ్చర్యకరంగా ఉంటాయి. సమగ్రాభివృద్ధికి ప్రతీకగా తెలంగాణ నిలుస్తుందనటంలో సందేహం లేదు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *