మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు సమైక్య రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిందని, ఆర్డీఎస్ నుండి జిల్లాకు రావాల్సిన నీళ్ళను ఏపీ ప్రభుత్వం ఆడ్డుకునేందుకు ప్రయత్నిస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు విమర్శించారు. మంగళవారం అసెంబ్లీలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ, మహబూబ్ నగర్ జిల్లాలోని ఆర్డీఎస్ పనులను కేంద్ర బలగాలను దింపయినా పూర్తిచేస్తామని, పాలమూరు జిల్లాకు రావాల్సిన న్యాయమైన నీటివాటాను చంద్రబాబు అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు.
ఆర్డీఎస్ నుండి 16.9 టీఎంసీల నీళ్ళు పాలమూరుకే దక్కాల్సిఉండగా, కేవలం 5టీఎంసీల నీళ్ళు మాత్రమే వస్తున్నాయని, ఈ నీళ్ళకోసం కేసీఆర్ పాదయాత్ర కూడా చేశారని హరీష్ రావు గుర్తుచేశారు. చంద్రబాబు రెండు కళ్ళూ సీమాంధ్ర వైపే ఉన్నాయని, పాలమూరు జిల్లా ప్రజలకు ఇకనుండి నష్టం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని, చంద్రబాబుకు తెలంగాణపై ప్రేమ ఉంటే ఆర్డీఎస్ పనులు జరిగేలా చూడాలని అన్నారు. విభజన చట్టంలో కూడా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఉందని, ఆర్డీఎస్ పనులను అడ్డుకోవడంపై సీడబ్ల్యూసీకి లేఖ కూడా రాశామని చెప్పారు.