తెలంగాణ విషయంలో చంద్రబాబు తీసుకున్న యూటర్న్ లు, చెప్పిన మాటలు ప్రజలు ఇంకా మర్చిపోలేదని, చివరి వరకు తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆయనను ప్రజలు ఎలా నమ్ముతారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తు అనైతికమని, తెలంగాణ ప్రయోజనాలకు ఈ పొత్తు గొడ్డలి పెట్టు అని ఆయన మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వంలో ఉండికూడా మోడీని ఎవరూ తిట్టనంతగా తిట్టిన చంద్రబాబు ఇప్పుడు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి పొత్తు పెట్టుకుంటున్నాడని, నీతి, నిజాయితీ లేని బాబు చెప్పే మాటలను ఎవరూ నమ్మరని పేర్కొన్నారు.
తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీతో బీజేపీ పొత్తు ఎలా పెట్టుకుంటుందని ప్రజలు అడుగుతున్నారని, పొత్తు వల్ల తమకు వచ్చిన నష్టం ఏమీ లేదని, సీమాంధ్రలో టీడీపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తారన్నదే తమ ఆందోళన అని హరీష్ అన్నారు. పోలవరం డిజైన్ మార్చాలని, ముంపు ప్రాంతాలు తెలంగాణలోనే ఉండాలని ప్రజలు కోరుతున్నారని, ఉద్యోగులకు ఆప్షన్లు ఉండొద్దని చంద్రబాబు నుండి బీజేపీ హామీ తీసుకుందా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రజల మానిఫెస్టోతో, అభ్యర్థుల జాబితాతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుందని హరీష్‌రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హరీష్‌రావుతో పాటు చేవెళ్ళ లోక్‌సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.