ఎప్పుడూ ఏదో ఒక కొత్త నాటకానికి తెరలేపి, జనాన్ని మెప్పించాలని విఫలయత్నం చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అన్నివిధాలా విఫలమైన బాబుకు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి ఢిల్లీలో దీక్ష అవసరమైంది! కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుచేసి, ఢిల్లీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష తంతు నడిపించారు! ప్రధాని మోదీకి వ్యతిరేక దీక్ష కనుక ప్రతిపక్ష నాయకులు కొందరు ఎట్లాగూ వస్తారు. దీన్ని తన ఘనతగా ఏపీ ప్రజల ముందు చాటుకోవాలనేది బాబు ఎత్తుగడ. దీక్ష పట్టిన మరుసటి రోజు జనాన్ని పోగేసుకొని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఓ వినతిపత్రం కూడా సమర్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన సమస్యలను పరిష్కరించాలని ఆ వినతి పత్రంలో కోరడం మరీ ఆశ్చర్యకరం. నిజంగా చంద్రబాబు విభజన సమస్యలను పరిష్కరించాలని ఉంటే, కేంద్ర హోం మంత్రిత్వ శాఖను సంప్రదించాలె. తెలంగాణతో ముడిపడిన వ్యవహారాలు ఉంటే ఇక్కడే పక్క రాష్ట్రంతో చర్చించుకోవచ్చు. కానీ దీక్ష పట్టడమూ, రాష్ట్రపతి దగ్గరికి ఊరేగింపూ, ఇంత హడావుడి అవసరమా? ఎన్నికల ముందు చిందులేయడం బాబుకు కొత్త కాదు. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు, బాబ్లీ ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి చొక్కా చింపుకొని తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు వినోదాన్ని పంచారు. ప్రజలెవరూ ఆయన నిజాయితీగా పోరాడుతున్నాడని నమ్మలేదు. నాటకాలకు ఓట్లు పడుతాయనుకోవడం చంద్రబాబు భ్రమ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్‌ఎస్ అధికారానికి వచ్చిన నాటినుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడైనా మహారాష్ట్రతో కానీ, కేంద్రంతో కానీ ఇంతగా గొడవ పడ్డారా? సమస్యలను సామరస్యంగా పరిష్కరించడంపై, అభివృద్ధి పథకాలపై దృష్టి పెట్టి ప్రజల మెప్పు పొందలేదా?
చంద్రబాబు ముఖ్యమంత్రిగా సాధించిందేమీ లేదు. వెనుకకు తిరిగి చూసుకుంటే, అనేక వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి. పుష్కరాల నిర్వహణ మొదలుకొని అమరావతి నగర నిర్మాణం వరకు ఆయన అసమర్థత కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. సీనియర్ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు రాజధాని నిర్మాణంలో పూర్తిగా విఫలమయ్యారు. కనీసం ముఖ్యమంత్రి కార్యాలయం, అసెంబ్లీ, సచివాలయ, హైకోర్టు భవనాలను శాశ్వత ప్రాతిపదికపై నిర్మించి ప్రజల అభిమానాన్ని మూటగట్టుకోలేకపోయారు. పైగా భూముల సేకరణకు సంబంధించి అనేక అవినీతి, ఆశ్రితపక్షపాత ఆరోపణలున్నాయి. కేంద్రం ఇచ్చిన వేల కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయనేది ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. ఆంధ్ర ప్రజలకు ఒక రాష్ట్రంగా మనగలుగుతామనే ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వకుండా, నిరంతరం ఆత్మన్యూనతను నూరిపోస్తూ వచ్చారు. అదే ఆయన మెడకు పాశంలా చుట్టుకున్నది. పాలనాకాలం చివరికి వచ్చేసరికి ఆంధ్ర సమాజంలోని దాదాపు అన్నివర్గాల్లో చంద్రబాబు పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడ్డది. ఈ దుస్థితి చంద్రబాబు చేతులారా తెచ్చిపెట్టుకున్నదే. చంద్రబాబుకు ఏపీని పాలించడం కన్నా, తెలంగాణ రాష్ట్రంలో తలదూర్చి దీనినొక విఫల రాష్ట్రంగా చేయాలనే కుతంత్రాలపైనే ఎక్కువ శ్రద్ధ వహించారు. కరెంటు ఇవ్వక ఇబ్బంది పెట్టాలా? నీళ్ళ విషయంలో కిరికిరి ఎట్లా పెట్టాలే, విభజన సమస్యలు తెగకుండా ఎట్లా తంపులు పెట్టాలె మొదలైన ఆలోచనలే ఆయన బుర్రనిండా చేరాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. జూదరి ఓడిపోయే కొద్దీ మరింత ఉన్మాదంతో సర్వాన్ని పణంగా పెట్టి పందెమాడుతాడన్నట్టు – ఇంకా అదే మాయా జూదంలో మునిగి తేలుతున్నాడు. అవమానభారంతో రగిలిపోతూ యుక్తాయుక్తాలు మరిచిపోతున్నాడు.
ప్రతిపక్షనేత, పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి, స్వయంగా తనతో ఇంతకాలం చెలిమి చేసిన ప్రధాని – ఇట్లా ఎవరు దొరికితే వారిపై నిందలు వేయడంలో ఊరట పొందుతున్నాడు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీకి, లోక్‌సభకు ఎన్నికలు పూర్తిగా సమీపంలో ఉన్నాయి. ఈ దశలో ఏదైనా చేసి చూపించాలన్నా చేయలేని దైన్యం చంద్రబాబును ఆవరించింది. ఇంత తక్కువ కాలంలో ఏమీ సాధించలేరు. అందువల్లనే అట్టహాసాలను ప్రదర్శించి జనాన్ని మెప్పించాలని భావిస్తున్నారు. ఇది జనం విజ్ఞతను తక్కువగా అంచనా వేయడమే. నాయకుడు సమర్థుడా కాదా అనే కాదు, నిజాయితీపరుడా కాదా అనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతున్నదో వారు గమనిస్తున్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన పాలనాచాతుర్యంతో ప్రజలను, దేశ నాయకులను ఎట్లా మెప్పిస్తున్నారనేది కూడా పోల్చిచూస్తున్నారు. అదే చంద్రబాబును వేధిస్తున్న బాధ. ఈ దశలో చంద్రబాబు చేయవలసింది ఒక్కటే. నిజాయితీగా తన వైఫల్యాన్ని ప్రజల ముందు అంగీకరించడం. తన తప్పులను బహిరంగంగా ఒప్పుకొని తాను మారిపోయానని, మరో అవకాశం ఇస్తే చక్కగా పనిచేస్తానని చెప్పాలె. దీన్ని ప్రజలు నమ్ముతారా లేదా అనేది వేరే విషయం. కానీ కనీసం ఒక నిజాయితీగా తన వైఫల్యాలను అంగీకరించిన నేతగా మిగిలిపోతారు. ప్రజలు మళ్ళా పట్టం కట్టినా, ఓడిపోయి ప్రతిపక్ష స్థానంలో ఉన్నా, మనసు తేటపడి కనీసం ప్రజల ముందు మాట్లాడగలిగే నైతిక స్థెర్యం లభిస్తుంది.