తెలంగాణలో కరెంటు కోతలకు ఏపీ సీఎం చంద్రబాబే కారణమని, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే ప్రతి సారీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన బాబు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ అందకుండా కుట్రలు చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా చిన్న కోడూరు మండలం మల్యాలలో మంగళవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, పీపీఏలను రద్దు చేయాలని కేంద్రాన్ని మరోసారి కోరారని, దీనివెనుక ఎంతటి కుట్ర దాగి ఉందో స్పష్టమవుతుందని, అవకాశం వచ్చిన ప్రతిసారి ఏదోరకంగా ప్రజలను మోసం చేయడం, ఇబ్బందులు కలిగించడం చంద్రబాబు నైజమని విమర్శించారు.
చంద్రబాబు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి రాష్ట్ర ప్రజల అవసరాలను తీరుస్తామని, బాబు కుట్రలు గమనించిన సీఎం కేసీఆర్ ప్రజల అవసరాలు తీర్చేందుకు ఖర్చుకు వెనుకాడకుండా పొరుగు రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చర్యలు చేపట్టారన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేసి తీరుతామని, ముఖ్యంగా రైతు రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, ఇల్లులేని పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.