Mission Telangana

తెలంగాణ దోపిడీకి నాయుడు ద్వయం కుట్రలు – హరీష్ రావు

కేంద్రప్రభుత్వం పోలవరం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలవరం ముసుగులో తెలంగాణలోని ఖనిజ సంపదను దోచుకునేందుకు చంద్రబాబు, వెంకయ్యనాయుడు కుట్రలు చేస్తున్నారని, రెండు లక్షల మంది గిరిజనులకు మరణశాసనం రాస్తున్న వీరిద్దరికీ తప్పకుండా గిరిజనుల గోస తగులుతుందని మండిపడ్డారు. వెంకయ్యనాయుడు ఒత్తిడితోనే పోలవరం ప్రాజెక్టులో ఏడు మండలాలను చేర్చారని, అసెంబ్లీ సలహాలు, సూచనలు లేకుండా రాష్ట్ర సరిహద్దులపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగానికి విరుద్ధమని మర్చి 4న రాష్ట్రపతికి లేఖ రాశామని హరీష్ రావు గుర్తుచేశారు.

మొదటినుండీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేశామని, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మర్చి 2న కేసీఆర్ ప్రకటన కూడా చేశారని, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కూడా చెప్పామని అన్నారు. పోలవరంలో ఏడు మండలాలను కలపాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో టీఆర్ఎస్ సంబరాలు చేసుకుందని అన్న వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని హరీష్ డిమాండ్ చేశారు. చింతూరులోని లోయర్ సీలేరు ద్వారా లభ్యమయ్యే 460 మెగావాట్ల విద్యుత్ ను తెలంగాణకు అందకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని, పోలవరంతో సీలేరు ప్రాజెక్టు మునిగిపోతుందని, దీనివల్ల ప్రతి ఏటా తెలంగాణకు కోట్లల్లో నష్టం జరుగుతుందని తెలిపారు.

యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ విధానాన్నే బీజేపీ అమలు చేసిందని ఆ పార్టీ నేతలు చెప్పడాన్ని ఖండిస్తూ, ఆర్డినెన్స్ తెచ్చింది కాంగ్రెస్ అయితే బీజేపీ ఆపొచ్చు కదా అని, తెలంగాణ మెడపై సేమాంధ్ర నేతలు కత్తిపెడుతుంటే తెలంగాణ టీడీపీ, బీజేపీ నేతలు ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పేరు మార్చుతామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పేరు మారిస్తే ఊరుకోమని, అలా అనుకుంటే తెలంగాణ ప్రభుత్వం చాలా పేర్లు మార్చాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *