నిజామాబాద్ ఎంపీ కవిత కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయితీ కార్యాలయం ఆవరణలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ లక్ష్మీపూర్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు, మహిళా భవనం నిర్మాణం కోసం రూ. 5 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
పసుపు రైతుల సమస్యల గురించి ఎన్నిసార్లు చెప్పినా కేంద్రం పట్టించుకోవట్లేదని, పసుపు రైతుల సమస్యలపై త్వరలో కేంద్ర వ్యవసాయ శాఖామంత్రిని కలుస్తామని చెప్పారు. దేశంలో పసుపు పండించే అన్ని రాష్ట్రాల సీఎంల మద్దతు కూడగడతామని, రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రయత్నిస్తామని కవిత పేర్కొన్నారు. లక్ష్మీపూర్ గ్రామస్తులు ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, ఇంటికి రెండు చెట్లు నాటాలన్నారు. డ్రిప్ ఇరిగేషన్ కోసం ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని ఎంపీ చెప్పారు.