ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 23న సమావేశం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశానికి సంసిద్ధంగా ఉండాలని కోరుతూ ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ లేఖలు రాసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్‌కుమార్ భల్లా అధ్యక్షతన ఈ నెల 23వ తేదీన జరుగనున్న సమావేశం రెండవది కావడంతో కొద్దిగానైనా ఆయనకు ఇరు రాష్ట్రాల సమస్యలపై అవగాహన కలిగి, న్యాయమైన తెలంగాణ రాష్ట్ర వాదనలకు ఆమోదముద్ర వేస్తారా? లేక తెలంగాణ ప్రజలకు రొటీన్‌గా అన్యాయం చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ముఖ్యంగా 9వ షెడ్యూలులోని 91 సంస్థల విభజన విషయంలో డాక్టర్ షీలాభిడే కమిటీ సిఫారసుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే అంశాలున్నాయని తెలంగాణ అధికారులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశాలన్నీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి గనుక తీర్పు వచ్చే వరకూ తుది నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేసే అవకాశం ఉంది.
అంతేగాక డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డిఐఎల్‌ఎల్-దిల్), ఎపి డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ల వివాదాల పరిష్కారంపై తెలంగాణ ఇచ్చిన విన్నపాలను గత సమావేశంలో కేంద్ర న్యాయశాఖ పరిశీలనకు పంపించారని, ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరిస్తూ అజయ్ భల్లా ఏమైనా నిర్ణయం తీసుకొంటారా? లేక మళ్లీ వాయిదా వేస్తారా ? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఎపి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వివాదంపైనా చర్చ జరుగుతుందని తెలిపారు.
ఇక అత్యంత కీలకమైన 10వ షెడ్యూలులోని 142 ఇన్‌స్టిట్యూషన్ల విషయంలో కూడా ఎలాంటి ముందడుగు పడలేదని, తెలుగు అకాడెమీ విషయంలో కోర్టులో కేసులు నడుస్తున్నాయని, ఈ సంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను భంగం కలిగించేవిగా ఉన్నాయని, గత సమావేశంలోనూ తాము వ్యతిరేకించామని, ఈ సారైనా కేంద్రం పరిష్కరిస్తుందా? తెలంగాణకు న్యాయం జరుగుతుందా? అనేది తేలాల్సి ఉందన్నారు.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్), ఎపి హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఎపిహెచ్‌ఎంఇఎల్)లు పూర్తిగా తెలంగాణకు చెందిన ఆస్తులని, ఇందులో విభజన అనంతర ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఎపిహెచెంఇఎల్ సంస్థ కేవలం సింగరేణికి అనుబంధ సంస్థ మాత్రమేనని, అందుకే సింగరేణిలో వాటాలు కోరుతున్న ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలను తెలంగాణ పూర్తిగా వ్యతిరేకిస్తోందని, ఇదే అంశాన్ని గత సమావేశంలో కూడా చాలా స్పష్టంగా చెప్పామని వివరించారు. ఈసారి సమావేశంలో కూడా ఆ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తామని అధికారులు చెబుతున్నారు. సింగరేణి కాలరీస్‌ను కాపాడుకోవడానికి ఎంతదాకైనా వెళతామని, ఇందులో రాజీపడే ప్రసక్తేలేదని, వీసమెత్తు అయినా సింగరేణి గనుల్లో ఎపికి వాటాలు ఇచ్చే ప్రసక్తేలేదని వివరించారు.
సివిల్ సప్లయీస్ కార్పోరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చిన నిధుల్లో వివాదాస్పదమైన 354 కోట్ల రూపాయల సబ్సిడీలో తెలంగాణ రాష్ట్ర వాటా తేలే వరకూ ఆ నిధులను విడుదల చేసేది లేదని ఆ అధికారులు పునరుద్ఘాటించారు. అంతేగాక విభజన చట్టంలో ప్రస్తావన లేనటువంటి 12 ఇన్‌స్టిట్యూట్‌లను విభజించడానికి ఎపి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు తాము అభ్యంతరం తెలిపామని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్న ఏపీ ప్రభుత్వ అన్ని ప్రయత్నాలను తప్పకుండా మళ్లీ అడ్డుకుంటామని చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు, బ్యాంక్ బ్యాలెన్స్‌లపైన కూడా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సలహాలు తీసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు గత సమావేశంలోనే అంగీకారం తెలిపామని, మళ్లీ అదే విషయానికి కట్టుబడి ఉంటామని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయంగా రావాల్సిన నిధులను విడుదల చేయించాలని అధికారులను కోరామని, అందుకు అజయ్ భల్లా గత సమావేశంలోనే ఆర్థికశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారని, కానీ ఇప్పటి వరకూ కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని, ఆ విషయాన్ని ఈ సమావేశంలో తప్పకుండా లేవనెత్తుతామని తెలిపారు.
గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోనే ఉన్న అంశాన్ని మళ్లీ చేస్తామని చెప్పారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తెలంగాణలో ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉన్న అంశాన్ని గుర్తు చేయడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వమే తాను రూపొందించిన చట్టాన్ని తానే తుంగలోతొక్కుతోందని, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని రూపొందించిన కేంద్రం ఆ చట్టాన్ని గౌరవించడం లేదని చెబుతూ నిరసన వ్యక్తం చేయనున్నామని తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 50, 51, 56లను సవరణలను చేయాలనే ఎపి ప్రభుత్వ ప్రయత్నాలను మళ్లీ వ్యతిరేకిస్తామని చెబుతున్నారు. రాష్ట్రాల విభజన జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత చట్టంలో సవరణలు చేయడం అర్థరహితమని, ఇలా చేస్తే ఆ చట్టానికి హేతుబద్ధత ఉండదని ఆ అధికారులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరు ఇలా ఉంది గనుకనే హోంశాఖ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోందని, గతంలో మాదిరిగానే ఈ సమావేశం కూడా మొక్కుబడిగా సాగుతుందా? లేక ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరిస్తారా? అనే అనుమానాలను తెలంగాణ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.